Tuesday, November 19, 2024

వైసిపి కేంద్ర కార్యాల‌యంలో స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్

అమ‌రావ‌తి – కరోనా నియంత్రణ, వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఒకవైపు కర్ఫ్యూను అమలు చేస్తూ.. మరోవైపు వ్యాక్సినేషన్, పేద, మధ్యతరగతి ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తూ కరోనాపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ చర్యలతో పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కోవిడ్ బారిన పడిన రోగులకు, ప్రజలకు స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అండగా నిలుస్తూ క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఈ సేవలను మరింతగా క్షేత్ర స్థాయిలో విస్తరింపజేయాలని వైయ‌స్సార్‌సీపీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలను భాగస్వామ్యం చేస్తూ, ముఖ్యంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ప్రజలంతా పాటించేలా వారిని చైతన్యవంతం చేయడంతో పాటు రోగులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ కోవిడ్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సేవలు వారికి ఉచితంగా అందేలా కృషి చేయాలని సజ్జల పిలుపునిచ్చారు.
స్థానికంగా కోవిడ్ సెంటర్లు లేని పక్షంలో అధికారులతో మాట్లాడి తక్షణమే వాటిని ఏర్పాటు చేయించాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా సేవలకు, 9143 54 1234; 9143 64 1234 వాట్సాప్ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు తమతమ నియోజకవర్గాల్లో కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, అందులో రెండు ఫోన్ నెంబర్లు కేటాయించి, ప్రజలు, ముఖ్యంగా కరోనా రోగులకు సహాయపడుతూ మీరు చేస్తున్న కార్యక్రమాలతో పాటు మీ సలహాలు సూచనలను పార్టీ స్టేట్ కంట్రోల్ సెంటర్‌ వాట్సాప్ ద్వారా పంపించాలని సజ్జల కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement