గుంటూరు మిర్చి యార్డుకు రోజుకు 3వేలకు పైగా రైతులు
లాక్ డౌన్ లేకుండానే కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు
ఇప్పటివరకు ఒక్క కేసూ నమోదు కానీ వైనం
నిరంతర పర్యవేక్షణతో నిబంధనల అమలు
ఛైర్మన్ చొరవను అభినందిస్తున్న రైతులు
గుంటూరు – కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ లేదా కర్ఫ్యు పెట్టడం సహజం. కరోనా విపత్కర పరిస్థితులలో క్లిష్ట నిబంధనలు అమలు చేయటంద్వారా వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నాలు ఇప్పటివరకు జరుగుతున్నాయి. సాధారణంగా జనసమ్మర్ధ ప్రాంతాల నుంచి కరోనా వ్యాప్తి అధికంగా జరిగేందుకు ఆస్కారం వుంటుంది. అయితే కర్ఫ్యు లు లాక్ డౌన్ లు లేకుండా ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖల మార్గదర్శకాలను చిత్తశుద్ధితో అమలు జరిపితే, ఎంతటి జనసమ్మర్ధం వున్నప్పటికి కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించే అవకాశం వుంటుందని రుజువైంది. అందుకు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (మిర్చి యార్డు) వేదికయింది. గత సంవత్సరం ఇదే నెలలో కరోనా కారణంగా దాదాపు మూడు మాసాలకు పైగా మిర్చి యార్డు ను మూసివేయాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఫలితంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కరోనా వ్యాప్తి కొనసాగింది. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో వుంచుకొని ఈ ఏడాది సైతం మిర్చి యార్డులో లాక్ డౌన్ విధించటం లేదా సెలవలు ప్రకటించటం చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి.
గుంటూరు లోని మిర్చి యార్డుకు కృష్ణా, గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రైతులు వస్తుంటారు. ఈ ఏడాది కర్నూలు, తెలంగాణ లోని ఖమ్మం, కొత్తగూడెం లతో పాటు కర్ణాటక లోని బళ్ళారి తదితర ప్రాంతాల నుంచి సైతం మిర్చి లోడ్ లతో రైతులు రాసాగారు. ఫలితంగా గుంటూరు మిర్చి యార్డుకు రోజుకు లక్షన్నర బస్తాల మిర్చి వచ్చి చేరుతున్నది. రైతులతో పాటు మిర్చికొనుగోలు చేసే వ్యాపారులు, కమిషన్ ఏజంట్ లు ఇతర సిబ్బంది దాదాపు మూడువేల మంది వరకు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో మిర్చి యార్డులో గత సంవత్సరం మాదిరే కరోనా విజృంభించగలదన్న ఆందోళనలు తలెత్తి, కారకలాపాలు నిలిపివేయాలన్న ప్రతిపాదనలు వెలువడ్డాయి. ఇప్పటికే రాష్ట్రంలోనే అతిపెద్దదైన గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల పసుపు యార్డులో కార్యకలాపాలను కరోనా కారణంగా నిలిపివేశారు. ఆ క్రమంలోనే మిర్చి యార్డుకు సైతం సెలవు ప్రకటిస్తారన్న వాదన వెలువడింది.
మిర్చి యార్డు మూసివేసిన పక్షంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే మిర్చి రైతులు సైతం నష్టపోవలసిన పరిస్తితి ఉత్పన్నం అవుతుంది. మిర్చి ధరలు ప్రస్తుతం కొంతమేర ఆశాజనకంగా వుంది రైతులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ స్థితిలో మూసివేసిన పక్షంలో ధరలు పతనం అయి రైతులు నష్టపోయే ప్రమాదం వుంది. వీటన్నింటినీ దృష్టిలో వుంచుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ యార్డులో కార్యకలాపాలు కొనసాగించాలని యార్డు పాలకవర్గం, ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం నిర్ణయించారు. ఆదేసమయంలో యార్డుకు వచ్చే రైతులు, వ్యాపారుల ఆరోగ్య పరిరక్షణ పట్ల సైతం శ్రద్ధ వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ దిశగా యార్డులో సిబ్బంది అంతటినీ సమాయత్తం చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఛైర్మన్ ఏసురత్నం సైతం యార్డు పనివేళలు ముగిసే వరకు యార్డు ఆవరణ అంతా తిరుగుతూ నిబంధనల అమలు పర్యవేక్షించటం తో పాటు, రైతులకు మనోధైర్యం కల్పిస్తున్నారు.
మాస్క్ లు పంపిణీ
యార్డు కు సుదూర ప్రాంతాల నుంచి రైతులు వస్తుంటారు. వారిలో చాలామందికి కరోనా నిబంధనల పట్ల అవగాహన వుండదు. దీన్ని దృష్టిలో వుంచుకొని యార్డు లోపలికి ప్రవేశించే అన్నీ గెట్ ల వద్ద సిబ్బందిని నియమించి ప్రతిఒక్కరికి మాస్క్ లు అందిస్తూ వారికి కోవిడ్ నిబంధనలు వివరిస్తున్నారు. అక్కడే వారికి శానిటైజ్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం యార్డు ఆవరణ అంతా ప్రతి దుకాణం వద్ద శానిటైజర్ లు, వుండేలా చర్యలు చేపట్టారు. దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో జనసమూహం వుండకుండా చూసేందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా యార్డు సిబ్బందిని బృందాలుగా నియమించి ఆవరణ అంతా గస్తీ తిరిగేలా ఏర్పాటు చేశారు. వారాంతంలో యార్డు ఆవరణ అంతటినీ, నిల్వ వున్న మిర్చి బస్తాలతో సహా మెషీన్ ల సహాయంతో శానిటైజ్ చేస్తున్నారు. యార్డు ఛైర్మన్ స్వయంగా యార్డు కార్యకలాపాలు కొనసాగినంత సేపు ఆవరణ అంతా కలియతిరుగుతూ పర్యవేక్షణ జరుపుతుండటంతో నిబంధనల అమలు పక్కాగా అమలు జరుగుతున్నది. ఈ కారణంగా మిర్చి యార్డులో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదని చెబుతున్నారు. రైతులు వచ్చే ప్రాంతాలలో లేదా వారి వారి గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు వున్నప్పటికి, వారి ద్వారా యార్డులో ఇతరులకు వ్యాప్తి చెందిన దాఖలాలు లేకపోవటం నిజంగా అభినందనీయమే.
యార్డు సెలవలకు కరోనా కారణం కాదు .. ఛైర్మన్
గుంటూరు మిర్చి యార్డు కు ఈనెల 21 నుంచి 25 వ తేదీవరకు సెలవు ప్రకటించారు. కరోనా కారణంగా సెలవు ప్రకటించారని జరుగుతున్నా ప్రచారంలో వాస్తవం లేదని ఛైర్మన్ ఏసురత్నం వెల్లడించారు. 21 వ తేదీ శ్రీరామ నవమి, 24, 25 సాధారణ వారాంత సెలవులు వున్నాయని,మధ్యలో 22,23 తేదీలలో యార్డులో అధికమొత్తంలో నిల్వవున్న దాదాపు 5లక్షలకు పైగా బస్తాలను తరలించేందుకు సెలవు ప్రకటించినట్టు ఆయన వివరించారు. 22,23 తేదీలలో యార్డుకు రైతులు కొత్తగా మిర్చి తీసుకు రావద్దని మాత్రమే విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. మిర్చి కొనుగోళ్ళు యధావిధిగా జరుగటంతో పాటు, సిబ్బంది పనిచేస్తారని ఆయన చెప్పారు. నిల్వలు అధికంగా పెరుకుపోతే ధరలు పతనం కాకుండా, రైతుల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.