విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి అలమండ సమీపంలో రైలు ప్రమాదం జరగటం దురదృష్టకరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటీవల కాలంలో దేశంలో రైలు ప్రమాద ఘటనలు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. రైలు ప్రమాదాలు నివారించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన మరవకముందే మరోమారు రైలు ప్రమాదం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలున్నా వాటిని సరిదిద్దుకుండా రైల్వే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు తూతు మంత్రంగా తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే తప్ప అధికారులు శాశ్వతంగా ప్రమాదాలను నివారించలేకపోతున్నారన్నారు. రైల్వేలను ప్రైవేటుపరం చేసే దుష్ట ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి ప్రాణ నష్టం నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులకు కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించి రెండు లక్షల రూపాయల పరిహారం అందించాలన్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందించి వారి కుటుంబాల్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.