Tuesday, November 12, 2024

మంగళగిరి రైతు బజార్ లో దళారుల రాజ్యం – ఎస్టేట్ ఆఫీసర్ దే పెత్తనం

మంగళగిరి ప్రభ న్యూస్- కూరగాయలను నేరుగా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లలో విక్రయించాలి. బయటి వ్యక్తులు దుకాణాల నిర్వహణకు అనుమతి లేదు. అయితే మంగళగిరి నిడమర్రు రోడ్డులోని రైతు బజార్ లో 23 దుకాణాలలో సగానికి పైగా ఏ మాత్రం వ్యవసాయానికి సంబంధం లేని వారు, దళారులు పాగా వేశారు. యదేచ్చగా కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. పైగా ప్రభుత్వ నిర్దేశించిన ధరలకు అదనంగా వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు బజార్ ఆదరణకు నోచుకోవడం లేదు.

ఎస్టేట్ ఆఫీసర్ దే పెత్తనం!
కాగా రైతు బజార్ పర్యవేక్షణ అధికారి గా కొనసాగుతున్న రమేష్ పై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాంగ్ స్టాండింగ్ లో కొనసాగుతున్న సదరు అధికారి లంచాలు తీసుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారని చెబుతున్నారు. ఒక్కో దుకాణ దారుని నుండి ప్రతి వారం రూ.250, దుకాణా లైసెన్స్ పొడిగింపుకు రూ.20 వేలు చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పచారి షాపు నుండి ఐదు పప్పు దినుసులను వేరు చేసి మరో షాపును ఏర్పాటు చేయించారని పైగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబీకులకు దుకాణాన్ని కేటాయించారని అంటున్నారు. సదరు దుకాణం నడుపుకునే వ్యక్తి ఏపీఎస్పీ క్యాంపు వద్ద మరో చిన్న పాటి రైతు బజార్ ను ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

వాస్తవ ధరలనే మార్చేస్తారు
రైతు బజార్ లో విక్రయించే కూరగాయల ధరల వివరాలను ప్రతిరోజు ఉదయం పట్టిక రూపంలో ప్రదర్శిస్తారు. అయితే ఆ బోర్డు లో ఉన్న ధరలను సైతం మార్చి అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నట్లు ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పర్యవేక్షణ అధికారి పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల కాలంలో రైతు బజార్ లో జరిగే అక్రమాలపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. ఏది ఏమైనా వచ్చినా ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటే రైతు బజార్ లు ఏర్పాటుచేసిన లక్ష్యం దారి తప్పకుండా ఉంటుంది.

ఈఓ వివరణ
దీనిపై ప్రభా న్యూస్ ప్రతినిధి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రమేష్ ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ గిట్టని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. రైతు బజార్ లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కూరగాయలను అమ్ముతున్నారని అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement