కరోనా బాధితుల సేవల్లో నర్సుల పాత్ర అమోఘం..
అయినవాళ్ళు కాదన్నా అక్కున చేర్చుకుంటున్నారు..
రోగుల హృదయాల్లో దైవస్వరూపాలుగా స్థానం..
ప్రోత్సాహకాల ఊసే లేదు.. రక్షణ సదుపాయాల కోసమూ వెంపర్లాటే..
గుంటూరు – దైవం ఎలా వుంటాడో ఎవరికీ తెలియదు. అది ఒక్కొక్కరి నమ్మకం, విశ్వాసం పై ఆధారపడి వుంటుంది. కరోనా విపత్కర పరిస్థితులలో నిరుపమాన సేవలు అందిస్తున్న నర్సులు ప్రత్యక్ష దైవాలు గా అందరి హృదయాలలో నిలిచిపోయారు. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టీ, కుటుంబాలకు, అయినవాళ్లకు దూరంగా వుంటూ అనునిత్యం కరోనా బాధితుల సేవలో గడుపుతున్న నర్సింగ్ సిబ్బందిని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా అభివర్ణించడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వైద్యరంగంలో నర్సుల పాత్ర ఎంతో కీలకమైనది. మా దేశం లో వున్న మూడు మిలియన్ ల నర్సింగ్ సిబ్బందే మా వైద్య రంగానికి వెన్నెముక అని అగ్రరాజ్యమైన అమెరికా ప్రకటించిందంటే నర్సుల ప్రాధాన్యత e స్థాయిలో వున్నదో ఊహించుకోవచ్చు. ఒక్క అమెరికా నే కాదు ఏ దేశంలోనైనా వైద్యరంగం అభివృద్ధి చెందటం లో నర్సులదే కీలక పాత్ర. నర్సింగ్ రంగానికే తలమానికంగా నిలిచిన ఫ్లారెన్స్ నైటింగేల్ సేవలను నేటికీ చిరస్మరణీయంగా వున్నాయంటే నర్సింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేశారన్న విషయం అవగతమవుతుంది. ఇంతటి ప్రాధాన్యత వున్న నర్సింగ్ సిబ్బంది పట్ల మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాము? వారికి తగిన గుర్తింపు, గౌరవం ఇస్తున్నమా? ప్రభుత్వం వారికి ఏ విధంగా చేయూత నిస్తున్నది? వారందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభిస్తున్నదా?లేదా? తదితర అంశాలపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వున్నది.
మృత్యువుతో సహవాసం
కరోనా విలయతాండవం చేస్తున్న జిల్లాలలో గుంటూరు ఒకటి. విద్య, వైద్య రంగాలలో గుంటూరు కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతిరోజూ లెక్కకుమిక్కిలిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రయివేటు వైద్యశాలల్లో దాదాపు 20 వేలమంది నర్సింగ్ సిబ్బంది అనుక్షణం కరోనా రోగుల సేవలో నిమగ్నమై ఉన్నారు. వారిలో 2,500 మంది వరకు ప్రభుత్వ నర్సులు వున్నారు. కరోనా బాధితులు త్వరగా కోలుకోవటం లో వైద్యుల చికిత్సకు ఎంత ప్రాధాన్యత వుంటుందో, నర్సులు చేసే సేవ అంతకుమించి వుంటుంది.
సాధారణంగా కరోనా వచ్చిన బాధితులను కుటుంబ సభ్యులు సైతం అంటరాని వారుగానే చూస్తున్న సంఘటనలు మనకు నిత్యం తారస పడుతూనే వున్నాయి. కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు కాదన్నా, అయినవాల్లందరు దూరం పెట్టినా కరోనా బాధితులను అక్కున చేర్చుకొని వారికి సేవలు అందించేది నర్సులు. ఆ సమయంలో ఆ బాధితుని కన్న తల్లిగా, తండ్రిగా, తోబుట్టువుగా, ఒక బిడ్డగా బహుముఖ ప్రేమను పంచుతూ వారిపాలిట ఆపద్బాంవులుగా నిలుస్తున్నారు. వారు చూపే ఆదరాభిమానాలు కరోనా బాధితులను త్వరితగతిన కోలుకునేలా చేస్తున్నాయి. కరోనా వైరస్ తమకు సోకితే, తమకు జరగరానిది జరిగితే, తమ కుటుంబాలు ఏమైపోతాయన్న తలంపు సైతం వారి స్ఫురణకు రాదు. వారిలోని అంకిత భావానికి, సేవాతత్పరతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఒకరకంగా చెప్పాలంటే నర్సింగ్ సిబ్బంది మృత్యువుతో సహవాసం చేస్తూ దానితోనే పయనిస్తూ విధినిర్వహణ లో మమేకమయ్యారు.
ఇదా గుర్తింపు?
కరోనా బాధితులకు తమ ప్రాణాలను, జీవితాలను ఫణంగా పెట్టి బాధితులకు సేవలు అందిస్తుంటే నర్సులకు లభిస్తున్న గుర్తింపు ఏమిటి? రోజుకు 8 గంటల పాటు పీపీ ఈ కిట్ లో వుండటం అంటే ఆషామాషీ కాదు. మండువేసవిలో పీపీ ఈ కిట్ లు వేసుకొని 8 గంటలపాటు మరోవైపు ఉక్కపోతను భరిస్తూ మరోవైపు రోగులకు ఏ చిన్న ఇబ్బంది కలుగకుండా నిర్విరామ సేవలు అందించటం సాధారణ మానవులకు సాధ్యం కాదు. అందుకే వారు కరోనా బాధితుల దృష్టిలో దైవస్వరూపులు గా నిలిచారు. ఇంత సేవ చేస్తున్నా ఏ చిన్న అపశృతి చోటుచేసుకున్నా ముందుగా నిందకు గురయ్యేది నర్సులు. ఉన్నతాధికారుల వేధింపులు, రోగి తరపు బంధువుల శాపనార్థాలు అన్నింటినీ వారు మౌనంగా భరిస్తున్నారు. చాలా చోట్ల వారి ప్రాణ రక్షణకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు సైతం వుండటం లేదు. అయినా వారి సేవలో ఏమాత్రం లోటు కన్పించ నీయక పోవటం విశేషం. ప్రభుత్వం సైతం వారిని ఫ్రంట్ వారియర్స్ గా గుర్తించి, ఆ సౌకర్యాలను వర్తింప చేస్తూ చేతులు దులుపుకొంది. వివిధ వర్గాల సంక్షేమం కోసం ఇస్తున్న ప్రోత్సాహకాలను నర్సింగ్ సిబ్బందికి అన్వయింప చేస్తే వారు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ఆస్కారం కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది.