మళ్లీ మొదలైన అంతర్గత పోరు
ప్రభుత్వ నిర్ణయంపై నిమ్మగడ్డ ఆగ్రహం
ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై అసహనం
అందుకే పరిషత్ ఎన్నికలకు వెనకడుగు
రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ల మధ్య మళ్లీ అంతర్గత యుద్దం జరుగుతోందా..? సర్దుబాటైన విభేదాలు మళ్లీ మొదటికొచ్చా యా..? అందుకే జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోందా..? అంటే అధికార వర్గాల నుంచి అవుననే సమాధా నమే వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుం టున్న తాజా సమీకరణలు, రాష్ట్ర ప్రభుత్వం
తీసుకుంటున్న నిర్ణయాలు, అందుకు భిన్నంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తీసుకుంటున్న చర్యలను బట్టి చూస్తుంటే గతంలో సర్దుబాటైన విభేదాలు మళ్లిd మొదటికొచ్చాయని స్పష్ట ంగా అర్థమవుతోంది. అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. గతంలో స్థానిక సంస్థ ల ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎన్నికల కమిషన్ మాత్రం నిర్వహించటానికి ముందుకొచ్చింది. ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతుంటే.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎస్‌ఈసీ మధ్య వార్ నడుస్తున్నట్లు స్పష్ట ంగా తెలుస్తోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వి జయవంతంగా పూర్తి చేశారు. అదే ఉత్సాహంతో జిల్లా పరిషత్ ఎన్నికలను కూడా ఎస్‌ఈసీ నిర్వ హిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిమ్మగడ్డ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్భంధం చేయాలని ఎస్‌ఈసీ చిత్తూరు జిల్లా పోలీసులకు ఆదేశాలివ్వడంపై అప్పట్లో ప్రభుత్వం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అదే విషయంపై కోర్టును ఆశ్రయించిన మంత్రి పెద్దిరెడ్డి.. ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుండి కథ మళ్లి మొదటికొచ్చింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు రాజ్‌భవన్‌లో ఇరువర్గాలు వేర్వేరుగా సమావేశమై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో చర్చించాయి. అప్పట్లో కేంద్రం ఇచ్చిన సూచ నల మేరకు గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య సాగుతున్న విభేదాలను సర్దుబాటు చేశారు. దీంతో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అంతే ప్రశాంత వాతావరణంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవు తుందన్న ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎన్నికలకు కూడా సిద్దమైంది. అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మాత్రం ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసులపై అసహనం వ్యక్తం చేస్తూ సెలవుపై వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పరిషత్ ఎన్నికల నిర్వహణకు వెనకడుగు
ఫిబ్రవరి 9, 13, 17, 21వ తేదీలలో ఇలా నాలుగు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ చేపట్టింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో పల్లె పోరును చేపట్టి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా మార్చి 10వ తేది రాష్ట్రవ్యాప్తంగా 12 పుర పాలక సంఘాలు, 75 నగరపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించి 14వ తేది కౌంటింగ్ ప్రక్రియను కూడా చేపట్టింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని మొదట ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే షెడ్యూల్‌ను కూడా సిద్దం చేసింది. అయితే పంచాయతీ ఎన్నికల నేప థ్యంలో చోటుచేసుకున్న పలు సంఘటనలను సీరియస్‌గా తీసుకున్న నిమ్మగడ్డ.. పరిషత్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపినా వెనకడుగు వేస్తున్నారు. కేవలం మంత్రి పెద్దిరెడ్డి తనపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడం, అందుకు తగ్గట్టుగా కమిటీ కూడా విచారణ చేపడుతున్నాం అందుబాటులో ఉండాలని ఎస్‌ఈసీకి నోటీసులు ఇవ్వడంపై ఆయన మరింత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే మరో పదిరోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
వారంలోపే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టు
రాష్ట్రంలో పంచాయతీ, పురపాలక సంఘాలకు నిర్వహించిన ఎన్నికలు వారం లోపే అన్నీ ప్రక్రియలు ముగిశాయని, అదే తరహాలో వారం లోపే జిల్లా పరిషత్ ఎన్నికలను చేపట్టి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. అయితే అందుకు ఎస్‌ఈసీ ససేమిరా అనడంతో ప్రభుత్వం ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టి కి తీసుకెళ్లింది. వీలైనంత త్వరగా జిల్లా పరిషత్ ఎన్నికలను ముగిస్తే కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసే అవకాశం లభిస్తుందని, ఆ దిశగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. ఈ మేరకు గత రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డిలు గవర్నర్‌ను కలిసి ఇదే విషయాన్ని చెప్పారు. దీన్నిబట్టి చూస్తుంటే పరిషత్ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు స్పష్ట ంగా అర్థమవుతోంది.
హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకురాని నిమ్మగడ్డ
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించా రు. గత ఏడాది మార్చిలో చేపట్టిన పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామి నేషన్ ప్రక్రియ ముగియడం, ఆ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా 125 జెడ్పీటీసీ స్థానాలు, 3 వేలకు పైగా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమ య్యాయి. అయితే ఏడాది తరువాత పరిషత్ పోరును నిర్వహించా లని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ ఎన్నికలను తిరిగి మొదట్నుంచీ చేపట్టాలని గతంలో ఏకగ్రీవాలను రద్దు చేయాలని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఏక గ్రీవాల సమయంలో ఫారమ్-10 అందజేయడంతో ఆ ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని, ఏకగ్రీవాలకు సంబంధించి తక్షణమే డిక్లరేషన్‌ను అందజేయడంతో పాటు యథాస్థి తి నుంచి పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని కోర్టు ఎన్నికల సంఘానికి సూచిం చింది. వాస్తవానికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కూడా యథాస్థి తి నుంచే ఎన్నికలు నిర్వహిం చాలని భావించినప్పటికీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న పలు సంఘటనలపై ఆయన హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు ముందుకు రావడం లేదు.
రెండు రోజుల్లో స్పష్ట త వచ్చే అవకాశం
ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నోటీసులపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పందించిన తీరును బట్టి చూస్తుంటే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నేపథ్యంలో విశ్రాంతి కోసం సెలవుపై వెళ్లే అవకాశాలు స్పష్ట ంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆయన హయాంలో పరిషత్ ఎన్నికలు లేనట్లే. ఇక కొత్త ఎస్‌ఈసీ ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇదే విషయంపై సోమవారానికి స్పష్ట త వచ్చే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నుంచి ఎస్‌ఈసీ సెలవు పెడితే ఇక పరిషత్ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలో లేనట్లేనని స్పష్ట త వస్తుంది. ఒకవేళ అదేరోజు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటిస్తే వారం లోపే పరిషత్ పోరు ముగిసే అవకాశం ఉంటుంది. ఏదిఏమైనా రెండు రోజుల్లో ఇదే విషయంపై స్పష్ట త వచ్చే అవకాశం ఉంది.