మంగళగిరి- ఫిబ్రవరి 24 ప్రభ న్యూస్- కేంద్ర ప్రభుత్వం అమృత్-2 పథకానికి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ను ఎంపిక చేసిందని ఇందుకు రూ.51 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అభివృద్ధికి 2023-24 బడ్జెట్ ఆమోద సమావేశాన్ని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి కమిషనర్ శారదా దేవి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులతో మంగళగిరి అభివృద్ధి పై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థగా ఆవిర్భవించిన తర్వాత రూ.344 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన తొలి బడ్జెట్ ను ఆమోదించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఏఐబి స్కీం క్రింద మంగళగిరి లో మెగా కన్ స్ట్రక్షన్స్ నేతృత్వంలో పైప్ లైన్ నిర్మాణం జరుగుతోందని, ఇక అమృత్-2 క్రింద త్రాగునీటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రజలకు నిరంతర నీటి సరఫరా సులభతరం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ర రెడ్డి మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అభివృద్ధికి రూ.135 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. నగర పరిధిలో రోడ్లు డ్రైన్లు త్రాగునీటి పైప్లైన్లు పార్కులు తదితర నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు.
పాత మంగళగిరి మీదగా హైవేను కలుపుతూ…
ట్రాఫిక్ సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా మంగళగిరి లోని గౌతమ బుద్ధ రోడ్డు నుండి పాత మంగళగిరి మీదుగా జాతీయ రహదారిని కలుపుతూ, రహదారిని విస్తరిస్తే బస్సులు ఆటోల రాకపోకల రద్దీ తగ్గుతుందని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. ఇందుకోసం నగరపాలక సంస్థ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
బాగవతుల వారి వీధి విస్తరణ విషయంలో వెనక్కు తగ్గేది లేదు
నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న భాగవతుల వారి వీధి రహదారి విస్తరణ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గేది లేదని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినందున భూ సేకరణ కు వెళ్లాలని న్యాయస్థానం తెలిపిందని అయినప్పటికీ టీడీఆర్ బాండ్లు ఇచ్చి ఒప్పించాలని మరో ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అయినప్పటికీ సఫలీకృతం కాకపోతే భూ సేకరణకు వెళ్తామని ఇందుకు నిధులు కూడా కేటాయించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ రహదారి తో పాటు తెనాలి రోడ్డు విస్తరణ పూర్తయితేనే మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య కొంతైనా తగ్గుతుందని చెప్పారు. పాత బస్టాండ్ వద్ద నిర్మాణం జరుగుతున్న చేనేత బజార్ భవన నిర్మాణం ఏప్రిల్ నాటికి 5 అంతస్తులు పూర్తవుతుందని పేర్కొన్నారు. మంగళగిరిలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 50 కోట్లు కేటాయించిందని పోలీస్ శాఖ సూచించిన ప్రకారం త్వరలో నగరం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటి పన్నుల బకాయిలను త్వరితగతిన వసూలు చేసి ఆదాయం పెంచుకోవడం ద్వారా అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నుండి రావాల్సిన పన్ను బకాయిలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంటి పన్నులు ఖాళీ స్థలాలకు పన్నులు కోసం వచ్చేవారిని తిప్పుకోకుండా త్వరితగతిన పన్నులు వేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి, అడిషనల్ కమిషనర్ హేమమాలిని, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి డిఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.