ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రత్యేక కథనం…
పనిచేసే వారికే పట్టం… అధిష్టానం అభీష్టం
కీలక వ్యక్తులకు ఎంపిక బాధ్యతలు
ప్రతిపాదనలు ఇవ్వాలని సూచన
భారీ సంఖ్యలో ఆశావహులు
50ః50 పద్దతి…
అమరావతి, పురపాలికలకు ఎన్నికలు పూర్త య్యాయి. ఫలితాలు వెలువడ్డాయి. ఇక మేయర్ పీఠానికి ఎన్నికలు ఈనెల 18న జరిపేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన కార్పొరేషన్ల పరిధిలో మేయర్ పీఠాలకు అభ్యర్ధుల ఎంపిక ఊపందుకుంది. కోర్టు తీర్పు కారణంగా ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు వెలువడలేదు. ఇక మిగిలిన 10 కార్పొరేషన్ల పరిధిలో మేయర్ పీఠాలు ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం కొందరు మంత్రులు సీఎం జగన్‌ను కలిసి మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయానికి కృతజ్ఞతగా అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించడానికి సీఎం జగన్ చిత్తశుద్ధి, అంకిత భావంతో అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని వారు సీఎం జగన్‌ను కొనియాడారు. ఇళ్ల పట్టాలు, నగదు బదిలీ, నాడు-నేడు వంటి కార్యక్రమాలు పట్టణ ప్రజలకు మరింత చేరువయ్యాయని, లబ్ది పొందిన ప్రతి కుటుంబం ఓటేసి రుణం తీర్చుకున్నారని మంత్రులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు తెలిపారు. ఈ సందర్భంగా పురపాలికల్లో ఓటింగ్ సరళిపై సీఎం వారితో చర్చించారని చెబుతున్నారు. అదే సందర్భంలో మేయర్ పీఠాలు ఎలా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలన్నదానిపై కూడా కూలంక షంగా చర్చించినట్లు సమచారం. దీనిపై పార్టీ బాధ్యులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులకు సీఎం బాధ్యత అప్పగించారని, వారిచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలకు సీఎం జగన్ ఉపక్రమిస్తారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కుల ప్రాతిపదికనేనా..?!
మేయర్ పీఠాలను కుల ప్రాతిపదికన కేటాయిస్తారని పార్టీలో ఒక ప్రచారం నడుస్తోంది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు పెద్ద పీట వేయాలని సీఎం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే, ఇప్పటికే పార్టీకి ఆది నుండి వెన్నంటి ఉండి పట్టణాలు, నగరాల్లో పార్టీని ఈస్థాయికి తీసుకొచ్చిన నేతలు మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. వారు కూడా ఇప్పుడు పోటీలో నిలబడి గెలుపొందారు. ఈక్రమంలో వారిని కాదని కొత్తవారికి అవకాశం కల్పిస్తే కొంత సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని, మధ్యే మార్గంగా ఎలా చేస్తే బాగుంటుందనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నట్లుగా తెలిసింది.
రికమండేషన్లతో ఆశావహుల ప్రయత్నాలు
ఇదిలా ఉండగా పార్టీ బాధ్యుల వద్దకు రికమండేషన్లతో ఆశావహులు బయలుదేరుతున్నారు. వారికి అండగా స్థానికంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ద్వారా పార్టీ బాధ్యులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. కొన్నికొన్ని చోట్ల మేయర్ పీఠం ఇచ్చే క్రమంలో నేతల మధ్య ఉన్న చిన్నపాటి అభిప్రాయ బేధాలు, ఇప్పటికే వారిచ్చిన మాటలు నెరవేర్చుకునేందుకు పట్టుదలలు కూడా అధిష్టానానికి కొంతమేర తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈక్రమంలో ఈ తంతును ఎవరినీ నొప్పించకుండా ఎలా చేయాలన్న దానిపై సీఎం జగన్, పార్టీ బాధ్యులు పలు రకాల ప్రతిపాద నలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.ఈ క్రమంలోనే ఆశావహులందరికీ అవకాశం కల్పించేలా 50 : 50 ప్రాతిపదికన మేయర్ పీఠాలను భర్తీచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధిష్టానం యోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒక నిర్ణయానికైతే రాలేదుగాని మధ్యే మార్గంగా ఈ విధానమే ఉత్తమమని కొంత మంది సీనియర్లు చెబుతున్నట్లు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలపాల్సి ఉంది. సీఎం జగన్ తన కేబినెట్‌ను కూడా 50 : 50 ప్రాతిపదికన తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారంతా మొదటి రెండున్నరేళ్లు కొనసాగతారని, తదుపరి రెండున్నరేళ్ల మరికొంత మందికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకే ఆవిధంగా ప్రచారం జరిగిందని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అదే ఫార్ములా అయితే బాగుంటుందనేది పార్టీలోని సీనియర్ల అభిప్రాయంగా చెబుతున్నారని తెలిసింది.
ఆశావహుల్లో అనేక మంది
ఇక కార్పొరేషన్ల పరిధిలో ఆశావహుల్లో అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి.విజయవాడ కార్పొరేషన్ పరిధిలో బండి పుణ్యశీల పేరు నిన్నటి వరకూ ప్రముఖంగా వినిపించినా తాజాగా ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని సీఎం జగన్ ఆలోచ చేస్తున్నారని, అందువల్ల బీసీల్లో ఉన్నత విద్యావంతురాలైన మహిళకు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. బీసీలకు ఇచ్చే క్రమంలో నాలుగైదు పేర్లు తెరపైకి రావడంతో ప్రస్తుతానికి ఈ అంశంపై కసరత్తు మరింత అవసరమని భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఓసీ వర్గాల నుండి కూడా భారీగా ప్రతిపాదనలు వస్తున్నాయి.
ఈక్రమంలో మొదటి రెండున్నరేళ్లు బీసీలకు, చివరి రెండున్నరేళ్లు ఓసీలకు ఇవ్వాలని పార్టీ నేతలు అధిష్టానానికి విజ్ఞప్తలు చేస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్‌కు కావటి మనోహర్ నాయు డు, పాదర్తి రమేష్ గాంధీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఒంగోలు కార్పొరేషన్‌లో సుజాత, కర్నూ లుకు బీవై రామయ్య, కడపకు సురేష్ బాబు, తిరుపతికి శిరీష పేర్లు ప్రముఖంగా వినిపిసు ్తన్నాయి. అయితే, ఈ కార్పొరేషన్ల పరిధిలో ఆశావహుల సంఖ్యేమీ తక్కువగా లేదన్నది కూడా వాస్తవమే. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మిగిలిన వాటికి సంబంధించి పేర్లు బయటకి రాకపోయినా పోటీ మాత్రం అధికంగానే ఉన్నట్లు తెలిసింది.
మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎమ్మెల్యేలకే
ఇక మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మేయర్ పీఠాన్ని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు కలిసి కూర్చుని నిర్ణయించాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. అందులో భాగంగా ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలు అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాజకీయ సమీకరణాలను సిద్ధం చేసి అభ్యర్ధులను ఖరారు చేసుకుంటున్నారు.