Friday, November 22, 2024

ప్ర‌భుత్వ ఆస్పత్రుల‌కు కొత్త ర‌క్తం….

అమరావతి, : పేదలందరికీ కార్పొరేట్‌ తరహాలో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటికే ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లతో పాటు విలేజ్‌ క్లినిక్‌ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి కొత్త రక్తాన్ని ఎక్కిస్తూ సంస్కరణలకు బాటలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కొత్త సంస్కరణను తీసుకువస్తోంది. రాష్ట్రం లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు సమగ్ర మార్పులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పీహెచ్‌సీల్లో ఇప్పటి వరకు ప్రైవేట్‌గా సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా రక్త పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే జిల్లా ఆసుపత్రులు, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) లు ప్రాంతీయ వైద్యశాలల్లో ఈ విధంగా మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇకపై అన్ని ఆసుపత్రుల్లో శాంపిల్స్‌ సేకరణ, ఫలితాల నిర్థారణ అంతా ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది చేత చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న రక్త పరీక్షలను రెట్టింపు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక పీహెచ్‌సీల్లో 19 రకాల రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ పరీక్షల సంఖ్య 35కి చేరనుంది. అలాగే సీహెచ్‌సీల్లో 40 రకాల రక్త పరీక్షలను నిర్వహిస్తుం డగా.. వాటి సంఖ్యను 79కి ప్రాంతీయ ఆసుపత్రుల్లో 62 రకాల పరీక్షలను 80కి జిల్లా ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఉన్న 62 రకాల వైద్య పరీక్షలను 136కి పెంచాలని ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. గతంలో ఉన్న సర్వీస్‌ ప్రొవైడర్‌ వ్యవస్థ నుంచి ఈ పరీక్షలన్నింటిని ప్రభుత్వ పరంగా నిర్వహించనున్నారు. ఇదే క్రమంలో రక్త పరీక్షలకు అవసరమైన పరికరాలు, ఇతర సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఈ నెల పదవ తేదీన టెండర్లు పిలవనున్నారు. అదే విధంగా సీహెచ్‌సీ లు, ప్రాంతీయ వైద్యశాలల్లో రేడియాలజీ పరీక్షలను విస్తృతం చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తోంది. ఎక్స్‌రే సదుపాయం లేని అన్ని సీహెచ్‌సీలు, ప్రాంతీయ వైద్యశాలల్లో పరికరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రైవేట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా ఎక్స్‌రేలు, ఇతర పరీక్షలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సర్వీస్‌ ప్రొవైడర్‌ కాంట్రాక్ట్‌ గడువు ముగియడంతో కొత్త టెండర్లను పిలిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఏడాది నవంబర్‌లోనే ప్రస్తుతం ఉన్న సర్వీస్‌ ప్రొవైడర్‌ కాంట్రాక్టు ముగిసినప్పటికీ ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఆ సంస్థతోనే యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే టెండర్లను పిలిచి కొత్త సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఈ బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ రెండు నిర్ణయాలతో ఆరోగ్య రంగంలో పలు మార్పులు జరగనున్నాయి. ఈ కొత్త సంస్కరణలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రులలో సైతం పేద ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement