Friday, November 22, 2024

ఎత్తులు, పై ఎత్తుల పుర‌పోరు..

అమరావతి, : రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుని తమ సత్తా చాటుకోవాలని ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే గత వారం రోజులుగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఎవరి వ్యూహం ప్రకారం అవి పోటాపోటీగా ప్రచారాలను నిర్వహించాయి.
భారీ మెజార్టీ స్థానాలపై.. వైసీపీ దృష్టి
గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. సుమారు 82 శాతం స్థానాలను వైసీపీ అనుచరులే కైవసం చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఆ దిశగానే మెజార్టీ స్థానాలను సొంతం చేసుకోవాలని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా మంత్రులను రంగంలోకి దించారు. ప్రధానంగా 12 కార్పొరేషన్ల పై వైసీపీ జెండాను ఎగుర వేయాలని పార్టీ శ్రేణులకు స్పష్ట మైన ఆదేశాలిచ్చారు. అలాగే 75 పురపాలక సంఘాల్లో కూడా మనదే పైచేయి కావాలని సూచించారు. దీంతో గత వారం రోజులుగా మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులు ఆయా నగర, పురపాలక సంఘాల్లో తిష్ట వేసి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ప్రధానంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి కార్పొరేషన్ల ను అధికార పార్టీ ఓ సవాల్‌గా తీసుకుంది. ఈ స్థానాల్లో గెలవడం కంటే కూడా భారీ మెజార్టీతో మేయర్‌ పీఠాలను సొంతం చేసుకోవాలని వ్యూహాత్మ కంగా పావులు కదుపుతోంది. సీఎం జగన్‌ కూడా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచే 13 జిల్లాలకు చెందిన నాయకులతో మాట్లాడుతూ భారీ మెజార్టీ సాధించే దిశగా కసరత్తు చేశారు.
సత్తా చాటుకునేందుకు.. రంగంలోకి దిగిన టీడీపీ
2019 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన టీడీపీకి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు జీవన మరణ సమస్యగా మారాయి. పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా వెనుకబడిపోయిన సైకిల్‌ను పురపోరు లోనైనా ముందుకు తీసుకురావాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంకల్పించారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రధాన పట్టణాల్లో రోడ్‌షోలు నిర్వహించడంతో పాటు సీఎం జగన్‌పై ఘాటైన విమర్శలతో ఎదురుదాడికి దిగారు.ప్రధానంగా విజయవాడలో రెండు రోజుల పాటు పర్యటించి స్థానిక మంత్రులపై నిప్పులు చెరిగారు. మరోవైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన జరిపారు.
దూకుడు పెంచిన జనసేన
గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో జనసేనకు ఓటు బ్యాంకు పెరిగింది. ఆ పార్టీకి పెరిగిన ఓటింగ్‌ శాతం ఏ పార్టీకి నష్ట మో స్పష్ట ంగా తెలియ కపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా జనసేన మాత్రం పుంజుకుంది. రాజకీయ విశ్లేషకుల్లోను ఇదే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన మెజార్టీ స్థానాల్లో గెలవలేక పోయినప్పటికీ ఓటింగ్‌ శాతం మాత్రం గతంతో పోలిస్తే రెండింతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రచారంలో ప్రత్యేకంగా ఎక్కడా పాల్గొనకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమవుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా దూకుడు పెంచారు.
పట్టణాల్లో పట్టుకోసం.. కాషాయం ప్రయత్నం
పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో వేగాన్ని అందుకోలేకపోయిన బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల్లోనైనా పట్టు సాధించాలని, ఆ దిశగా ఆ పార్టీ నేతలు తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తదితర నాయకులు విస్తృతంగా పర్యటించి అధికార పార్టీపై విమర్శల బాణాలు వదిలారు. జనసేన మద్దతుతో మంచి ఫలితాలు రాబట్టాలని బీజేపీ భావిస్తోంది. మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ కూడా తమ ఉనికిని కాపాడు కునేందుకు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌పై విమర్శలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement