పిఠాపురం, ప్రభన్యూస్ : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అన్నపూర్ణా థియేటర్ వద్ద తుపాకీతో యువకుడు కలకలం రేపాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద గన్‌తో ఫోజులు హల్‌చల్ చేశాడు. అయితే అది డమ్మీ గన్ అని తిరునాళ్లలో బుడగలు పేల్చే గన్‌గా పోలీసులు తేల్చారు. శుక్రవారం రామ్‌చరణ్, జూనియర్ ఎన్టిdఆర్ నటించిన త్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సహజంగానే థియేటర్ వద్ద ప్రేక్షకులు పోటెత్తారు. ఈ తరుణంలో స్థానిక కోటగుమ్మం సెంటర్ స్టీలు సామాను దుకాణం యజమాని మారోజు వైకుంఠ బాలాజీ తుపాకీతో ప్రత్యేక్షమయ్యాడు. తుపాకీతో గాలిలోకి గాల్పులు జరుపుతున్నట్లు నటిస్తూ హల్‌చల్ చేశాడు. తుపాకీ, అది పెట్టుకునే పౌచు చూసిన ప్రేక్షకులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడితో ఆగకుండా థియేటర్‌లోకి వెళ్లిన బాలాజీ తెర ఎదుట ఫోజులు ఇస్తూ, కాల్పులు జరుపుతున్నట్లు నటిస్తూ హడావుడి సృష్టించాడు.
ఇది కాస్తా పోలీసులకు సమాచారం చేరడంతో సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన థియేటర్‌కు చేరుకుని బాలాజీని అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో కాకినాడ డిఎస్పీ భీమారావు మాట్లాడుతూ నిందితుడు వద్ద వున్నది డమ్మీ ఫిస్టల్‌గా తెలిపారు. ఫిస్టల్‌తో పాటూ పౌచ్‌లోని పిల్లేట్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనల ప్రకారం ఫిస్టల్‌ను ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. ఈ తుపాకీని ఒక్కోసారి పిట్టలు కొట్టడానికి ఉపయోగిస్తుంటారని తెలిపారు. నిందితుడిపై నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలు ధరించినందుకు, పబ్లిక్‌లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసినందుకు కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఐ శంకరరావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.