కర్నూలు, (ప్రభ న్యూస్ బ్యూరో) : నాటు సార క్రయ, విక్రయ కేసులో ముగ్గురి పై పీడీ యాక్టు కేసు నమోదు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. పీడీ యాక్టు నమోదైన వ్యక్తులలో ఆదోని పరిధిలోనీ అరుణ్ జ్యోతి నగర్ కు చెందిన ఒలుమన్న, కౌడల్ పేటకు చెందిన బోయ రంగన్న, కర్నూలులోని బంగారు పేటకు చెందిన కల్లి కోట కృష్ణ ఉన్నారు. గడచిన మూడు సంవత్సరాల్లో నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలకు పాల్పడిన ఆదోని పట్టణానికి చెందిన ఒలుమన్నపై 6 కేసులు , బోయ రంగన్న పై 7 కేసులు , కర్నూలు పట్టణానికి చెందిన కల్లి కోట కృష్ణపై 5 కేసులు నమోదు అయినట్టు ఎస్పీ వెల్లడించారు.
ఈ ముగ్గురు కూడా చాలా రోజుల నుండి నాటుసారా తయారీ, అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్నారు. వీరిపై పలుమార్లు క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించినా కూడా వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఈ విషయం పై కర్నూలు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపగా, జిల్లా కలెక్టర్ ఈ ముగ్గురి పై పిడి యాక్టు కు ఉత్తర్వులు జారీ చేశారు .శుక్రవారం ఆదోని త్రీ టౌన్ పి. నరేష్ బాబు, కర్నూలు సెబ్ స్టేషన్ సిఐ సత్యనారాయణ లు ఈ ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని కడప సెంట్రల్ జైలుకు తరలించడమైనది.