Saturday, September 21, 2024

Gudiwada – అన్నా క్యాంటీన్లకు పున‌ర్జీవం… చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం

ఏకం కాలంలో వంద క్యాంటీన్లు ప్రారంభం
గుడివాడ‌లో చంద్ర‌బాబు శ్రీకారం
క్యాంటీన్ లో స్వ‌యంగా మీల్స్ వ‌డ్డింపు
పేద‌ల‌తో క‌ల‌సి భోజ‌నం చేసిన సిఎం దంపతులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – గుడివాడ – ఎపిలో మ‌ళ్లీ అన్నా క్యాంటీన్ లు ప్రారంభ‌మ‌య్యాయి.. స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున ఎపిలోని వివిద న‌గ‌ర‌,ప‌ట్ట‌ణ‌, గ్రామీత ప్రాంతాల‌లో వంద క్యాంటీన్ ల‌ను ఏక‌కాలంలో ప్రారంభించారు.. గుడివాడ మునిసిపల్ పార్క్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు , భువ‌నేశ్వ‌రి దంప‌తులు ఆన్నా క్యాంటీన్ కు ప్రారంభోత్స‌వం చేశారు. అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి దంపతులు భోజనాన్ని క్యాంటీన్ కు వ‌చ్చిన వారికి స్వ‌యంగా వడ్డించారు. ఆపై చంద్రబాబు దంపతులు సైతం సైతం 10 రూపాయిలు చెల్లించి టోకెన్ తీసుకుని మరీ అక్కడే భోజనం చేశారు. భోజనం చేస్తున్న స‌మయంలో చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు.

- Advertisement -

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ… అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం అందిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమేనని వ్యాఖ్యానించారు. కడుపు నిండా తిండి తినాలని కోరుకుంటామని తెలిపారు.  ఆయన డొక్కా సీతమ్మ గురించి కూడా ప్రస్తావించారు. నాడు గోదావరి దాటి వచ్చిన వాళ్లకు డొక్కా సీతమ్మ తిండి పెట్టేదని, ఇప్పటికీ డొక్కా సీతమ్మను అన్నదానంలో  మేటి మహిళగా గుర్తుపెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు. 

ఎన్టీ రామారావు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతిలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాము అన్న క్యాంటీన్లను తీసుకువస్తే, గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని అన్నారు. 
“రద్దు చేయవద్దు… క్యాంటీన్లకు మీ పేరే పెట్టుకుని వాటిని కొనసాగించండి… పేదలకు పట్టెడన్నం పెట్టండి అని ఆనాడు కోరాం. ఒకవేళ మీరు అన్నం పెట్టలేకపోయినా దాతలు వస్తారని చెప్పాం. కానీ గత ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతుంటే అడ్డుకున్నారు. ఇక అలాంటి పరిస్థితి రాదు. సెప్టెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు తీసుకువస్తాం. 

పేదవాళ్లకు తిండిపెట్టడం మనందరి కనీస బాధ్యత. ఓ మంచి ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం కోసం హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదాయకం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని పిలుపునిస్తున్నా. ఇది శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఖర్చుపెడితే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి” అని చంద్రబాబు వివరించారు.

తమ వంతుగా ప్రజలు విరాళాలు ఇవ్వాలని కోరారు. అన్న క్యాంటీన్ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించారు. 

అన్న క్యాంటీన్ బ్యాంకు ఖాతా వివరాలు:
బ్యాంకు – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అకౌంట్ పేరు – అన్న క్యాంటీన్
అకౌంట్ నెంబర్ – 37818165097
IFSC – SBIN0020541 
బ్రాంచ్ – చంద్రమౌళి నగర్, గుంటూరు

Advertisement

తాజా వార్తలు

Advertisement