అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రూ 10 కోట్లతో ఈ ఏడాది జులై నుంచి అమలవుతున్న నేషనల్ బాంబూ (వెదురు) మిషన్ (ఎన్.బి.ఎం) సత్ఫలితానిస్తోంది. 500 హెక్టార్లుగా ఉన్న వెదురుసాగును 2023-24లో 1500 హెక్టార్లకు విస్తరింపచేయాలని నిర్ణయించగా గడిచిన ఆరు నెలల్లోనే లక్ష్యానికి చేరువయినట్టు అంచనా. ఈ ఏడాది మే చివరినాటికి ముగిసే సాగు సంవత్సరంలో సుమారు 2 వేల హెక్టార్ల విస్తీర్ణానికి చేరువయ్యే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బాంబూ మిషన్ అమలు చేస్తోంది.
నేల స్వభావం, వాతావరణం ఆధారంగా వెదురు సాగుకు ఏపీ అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. మూడేళ్ల పాటు అమలులో బాంబూ మిషన్ ద్వారా 2022-23లో 500 హెక్టర్లతో మొదలయి 2023-24లో 1500హెక్టారక్లు, 2024-25లో 3,000 హెక్టార్లకు విస్తరింపచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు గతంలో అటవీశాఖ పరిధిలో ఉండే వెదురసాగును రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ఆధీనంలోకి తీసుకొచ్చింది.
వెదురుసాగును కేవలం అటవీ ప్రాంతాలకు పరిమితం చేయకుండా ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములు, ప్రైవేటు భూములు, కాల్వలు, చెరువులు, రిజర్వాయర్ల గట్లపై కూడా పెంచేలా నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. బాంబూ మిషన్‌ను విజయవంతం చేసేందుకు వెదురుసాగును ప్రోత్సహించేలా రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షణ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్, వ్యవసాయ, ఉద్యానశాఖ కమిషనర్లతో పాటు- అటవీ, పర్యావరణ, పరిశ్రమ శాఖల కార్యదర్శులు వైస్ చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు.
వెదురుసాగు చేపట్టే రైతులందరూ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వభూముల్లో చేప ట్టే వెదురుసాగుకు ప్రభుత్వం నుంచి నూటికి నూరుశాతం సబ్సిడీ అందుతోంది. వెదురుసాగును ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు కోసం ఏర్పాటు చేసే నర్సరీలకు కూడా బాంబూ మిషన్ ద్వారా 40 శాతం సబ్సిడీ అందుతుంది. రైతులకు వివిధ రూపాల్లో అందించే రాయితీలు, సబ్సిడీల కోసం రూ 1184 కోట్లతో బాంబూ మిషన్ అమలు మిషన్ అమలు చేస్తుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి ప్రాతిపదికన వ్యయం చేయనున్నాయి.
90 ఏళ్ల వరకు ఆదాయం
వెదురు మొక్కను నాటిన తరువాత నాలుగో ఏడాది నుంచి రైతులకు ఆదాయం వస్తుంది. నేల సారం ఆధారంగా గరిష్టంగా 90 ఏళ్ళ వరకు దిగుబడి నివ్వటం వెదురు ప్రత్యేకత..అంతేకాదు..కార్బన్ డయా-కై-్సడ్ ను తీసుకుని ఆక్సిజన్‌ను అందించే వెదురు సాగు పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నివారించేందుకు కూడా వెదురు ఉపయోగపడుతుంది.
కాలుష్య నియంత్రణ కోసం ఇప్పటివరకు బొగ్గును వాడుతుండగా దీని వల్ల ప్రమాదకరమైన బొగ్గు పులుసు వాయువు (సీఓ2) విడుదలై వాతావరణాన్ని కాలుష్యమయం చేస్తున్నందున వెదురు గుళికలు వాడాలని జాతీయ ఇంధన విధానంలో కేంద్ర ప్రభుత్వం ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు సూచించింది. దీంతో వెదురు బొంగుల నుంచి తయారుచేసే వెదురు గుళికలకు భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ప్రతి ఏడాది సుమారు 30 లక్షల టన్నుల వెదురు బొంగులకు డిమాండ్ ఉన్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో వెదురు సాగు విస్తీర్ణం రానున్న రెండేళ్లలో అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అంచనా.