విశాఖపట్నం, ప్రభన్యూస్: భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్‌గా అత్యంత ప్రతిభాపాటవాలు చూపిన కోన శ్రీకర్ భరత్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 ఆఫీసర్‌గా ఉద్యోగంతో పాటు, విశాఖలో ఇంటి నిర్మాణం కోసం వెయ్యిగజాల స్థలం మంజూరు చేసిందని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ తెలిపారు.
విశాఖ నగరంలోని శుక్రవారం వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, భరత్ క్రీడా స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే యువ క్రీడాకారుడిని భారత జట్టుకు అందించిన భరత్ తల్లిదండ్రులను ఆయన అభినందించారు.
రాష్ట్రంలో క్రీడాస్పూర్తిని పెంచేందుకు త్వరలోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ఆయన తెలియజేశారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ, దేశంలోని 142 కోట్ల జనాభాలో క్రికెట్ క్రీడలో 14 మంది భారత్ జట్టులో భరత్ ఒకడిగా నిలిచాడని అన్నారు.
దేశంలోని 10 కోట్ల మందిలో ఒక్కరికి ఇటువంటి అవకాశాలు లభిస్తుందని, అందులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన భరత్‌కు ఈ సదవకాశం లభించటం మనందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులందరూ భరత్ ను ఆదర్శంగా తీసుకోవాలని, భరత్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయటానికి ముందుకు వస్తే ప్రభుత్వం అందుకు సహకరిస్తుందని మంత్రి చెప్పారు.
ఎంతో కష్టపడి వికెట్ కీపర్‌గా ఎదిగి క్రికెట్‌లో అత్యుత్తమ క్రీడాకారులుగా గుర్తింపు పొందిన ధోనీ స్థాయికి భరత్ చేరుకోవాలన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటు-న్నారన్నారు. ఈ కార్యక్రమంలో భరత్ తల్లిదండ్రులతో పాటు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాధ్ రెడ్డితో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.