Tuesday, November 26, 2024

ఏపీ అంగన్‌వాడీల ఆధునికీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి, ఆంధ్రప్రభ : అంగన్‌వాడీల ఆధునీకరణ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు సమకూర్చేందుకు కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం మూడు దశల్లో అంగన్‌వాడీల ఆధునీకరణ పనులు జరగనున్నాయి. మహిళలు, చిన్నారులకు మరింత సమర్థవంతంగా అంగన్‌వాడీల్లో సేవలు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం భారీగి నిధులను ఖర్చుచేయనుంది. దీనిలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌలిక వసతులతోపాటు ఆధునిక సౌకర్యాల కోసం నిధులు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనేక పథకాల కింద రూ.545 కోట్ల 97 లక్షల 55 వేలను బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.205 కోట్ల 21 లక్షల 74 వేలను విడుదల చేసింది. నూతన విద్యావిధానంలో భాగంగా అంగన్‌వాడీలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో కలిసి బోధన పద్ధతిలో సమన్వయాన్ని తీసుకురావడానికి, పిల్లల మెరుగైన అభ్యాస ఫలితాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాల్లో 27 వేల 620 కేంద్రాలను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఆవరణలోనే నిర్వహిస్తున్నారు. మరో 27 వేల 987 కేంద్రాలను శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌గా నిర్వహిస్తున్నారు. పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న వాటిలో 1,803 అంగన్‌వాడీ కేంద్రాలకు నాడు-నేడు కార్యక్రమంలో 3 వేల 431 అదనపు తరగతి గదులను ప్రభుత్వం మంజూరు చేసింది.

వీటి నిర్మాణానికి కసరత్తు మొదలైంది. వీటితోపాటు ఇప్పటికే 960 అంగన్‌వాడీ కేంద్రాల భవనాల ఆధునికీకరణకు భారీగా నిధులు మంజూరు చేసింది. ఒక్కొక్క కేంద్రం ఆధునీకరణకు రూ.2 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. ఆ నిధులతో పాత భవనాల మరమ్మతులు, మంచినీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు సమకూర్చనున్నారు. వీటిలో ఇప్పటివరకు 128 కేంద్రాల పనులు పూర్తయ్యాయి. 282 కేంద్రాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సొంత భవనాలు కలిగిన అంగన్‌వాడీ కేంద్రాలకు 10 వేల 472 మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ.15 వేల చొప్పున కేటాయించారు. 2 వేల 628 అంగన్‌వాడీ కేంద్రాలకు మంచినీటి కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు రూ.10 వేల వంతున నిధులు కేటాయించారు. అంగన్‌వాడీ కేంద్రాల తాజా పరిస్థితి రాష్ట్రంలో 257 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 21 వేల 197 కేంద్రాలు పాఠశాలల ఆవరణలో సొంత భవనాల్లో పనిచేస్తున్నాయి. మరో 10 వేల 652 అంగన్‌వాడీ కేంద్రాలు పాఠశాల తరగతి గదులు, పంచాయతీలు, ఇతర భవనాల్లో ఎలాంటి అద్దెలు లేకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 23,758 అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటన్నింటికీ సొంత భవనాలు నిర్మించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. విశాల మైన ప్రాంగణాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నూతనంగా నిర్మిచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

రానున్న ఐదేళ్లలో అన్నీ అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. మంచినీటి వసతి, టాయిలెట్లు, ఇతర సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీటి సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో కల్పించారు. ఇక టాయిలెట్లు, విద్యుత్‌ కనెక్షన్లు పూర్తిస్థాయిలో ఇచ్చేందుకు చర్యలు తీ సుకుంటున్నారు. మరో 16 వేల కేంద్రాల్లో టాయిలెట్లు, 8 వేల కేంద్రాల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో అంగన్‌వాడీల అభివృద్ధికి మహిళా శిశు సంక్షేమ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రంలోని పలు పథకాల ద్వారా నిధులను రాబట్టేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 15 వేలు మాత్రమే మంజూరు చేయగా ఆ మొత్తాన్ని రూ. 30 వేలకు పెంచేందుకు శిశు సంక్షేమ శాఖ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగా పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement