Tuesday, November 19, 2024

AP: గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు గ్రీన్‌సిగ్నల్‌.. పూర్తి వివరాలు సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాల‌న్న హైకోర్టు

అమరావతి, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు హైకోర్టు ఓకే చెప్పింది.. షెడ్యూల్‌ ప్రకారం మౌఖిక పరీక్షలు నిర్వహించడంతో పాటు ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. నియామకపు ప్రక్రియతో సహా అన్నీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పింది.

గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ మాన్యువల్‌ మూల్యాంకనం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించి మమ అనిపించిందని ఈ ప్రక్రియలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాన్యువల్‌ మూల్యాంకనంలో ఫెయిలైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 29వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్వ్యూలను నిలుపుదల చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై అటు ఏపీపీఎస్సీ, ఇటు అభ్యర్థుల తరుపున సీనియర్‌ న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు.

విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ ఇంటర్వ్యూల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీపీఎస్సీకి తగిన ఆదేశాలతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇంటర్వ్యూలకు మార్గం సుగమమైంది. గతంలో డిజిటల్‌ ఇప్పుడు మాన్యువల్‌ మూల్యాంకనాల కోసం భారీగా ఖర్చుచేశారని పిటిషనర్లు ఆరోపించిన విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తుతించారు. ఓ సారి మాన్యువల్‌గా మూల్యాంకనంచేసి తరువాత దాన్ని గోప్యంగా ఉంచి మరోసారి మూల్యాంకనం నిర్వహించారనే అభియోగాలు ఉన్నందున దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

అయితే ఈ ఆరోపణలను ప్రాథమిక స్థాయిలోనే ఏపీపీఎస్సీ తరుపున సీనియర్‌ న్యాయవాది ఖండించారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు వీలుగా సమాధానపత్రాలను డిజిటల్‌తో పాటు మాన్యువల్‌గా కూడా దిద్దాలని గత ఏడాది హైకోర్టు ఏపీపీఎస్సీని ఆదేశించింది. అభ్యర్థుల ఎంపికను త్వరితగతిన పూర్తిచేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల అమల్లో భాగంగానే ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పటికే 325 మంది అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు హాజరు కావాల్సిందిగా ఏపీపీఎస్సీ లేఖలను అందుకున్నారని అందువల్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు అనుమతించాలని కోరింది.

షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు, ఎంపికకు అనుమతిస్తూ మరోవైపు పిటిషనర్ల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎంపిక ప్రక్రియ ఫలితాలు ఈ వ్యాజ్యాల్లో ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పిటిషనర్ల సమాధానపత్రాలు, వారి మార్కుల వివరాలను సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ తదుపరి విచారణ జూలై 17వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement