Thursday, November 21, 2024

AP | 12వ పీఆర్‌సీకి గ్రీన్‌సిగ్నల్‌.. కమిషనర్‌గా రిటైర్డు ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన సవరణ కమిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డు ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ను నియమించింది. ఏడాదిలోగా వేతన సవరణకు సంబంధించిన నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రె డ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూలై 1వ తేదీ నాటి నుండి అమల్లోకి వచ్చేలా 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పే స్కేలును ప్రభుత్వం సవరించింది. కాగా కొత్త పీఆర్‌సీ ఈ ఏడాది జూలై ప్రామాణికంగా వచ్చే ఏడాది కమిషన్‌ చేసే సిఫార్సుల మేరకు నిర్ణయాలు తీసుకోనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న పే రిజివన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ)కి నియమ నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లోఉన్న డీఏను ఏ మేరకు వేతనంలో విలీనం చేయవ చ్చో పరిశీలన జరిపి తద్వారా కొత్త పేస్కేల్‌కు రూపకల్పన చేయాలని నిర్దేశించింది.

సవరించిన పే స్కేల్‌లో వేతన స్థిరీకరణ విధానాన్ని సూచించే గతంలో చోటుచేసుకున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సవరించే విధంగా ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీంను ఆధ్యయనం చేయటంతో పాటు ప్రస్తుతం ఉన్న పద్దతిని కొనసాగించాలా? వద్దా అనేది కమిషన్‌ ఆధ్యయనంచేసి ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేస్తుంది. వివిధ ప్రత్యేక చెల్‌ిపులు, పరిహారాలు, అలవెన్సులు, ఇతర అనుమతుల అవసరాలను పరిశీలించటానికి ప్రస్తుతం నిర్వహిస్తున్న నగదు, అనుమతుల కొనసాగింపుపై ప్రతిపాదనలు చేస్తుంది. ఇందులో సవరణలు, భవిష్యత్తులో నియంత్రణ షరతులు, ధరలు, నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. పెన్షనర్ల ప్రయోజనాలు ప్రస్తుుత విధానం.. భవిష్యత్‌ వెసులుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలి.

రాష్ట్ర విభజన సందర్భంగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో సహా సమకాలీన అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుత మానవ వనరులపై సమీక్ష నిర్వహించాలి. ఏదైనా కేటగిరీ పోస్టును గజటెడ్‌గా మార్పు చేసేందుకు అనుసరించాల్సిన నిబంధనలు మార్గదర్శకాల రూపకల్పనకు అసోసియేషన్లు, అడ్మినిస్ట్రేటివ్‌ వి భాగాలు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు, సిఫార్సులు చేసే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తి స్థాయి గణాంకాలతో క్రోఢీకరించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. పే రి విజన్‌ కమిషన్‌ ప్రాధాన్యతలను స్వీకరించేందుకు విచారణకు అవసరమైన ఏర్పాట్లతో పాటు అవసరమైన సమాచారాన్ని హెచ్‌ఓడీలు అందుబాటులో ఉంచాలి. రాష్ట్ర సచివాలయం ప్రధాన కేంద్రంగా కమిషన్‌ రాష్ట్రంలో ఏఇతర ప్రాంతంలో అయినా పర్యటించే వీలుంది. పీఆర్‌సీ కమిషనర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏడాది లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థల్లో వివిధ కేటగిరీల ఉద్యోగులు, ఆచార్య ఎన్టీ రంగా విశ్వ విద్యాలయంతో సహా బోధనేతర సిబ్బంది వేతనాల నిర్మాణం, సేవా పరిస్థితుల నియంత్రణకు నిబంధనలు, ఎన్జీ రంగా వర్శిటీతో పాటు జేఎన్‌టీయూ, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మార్పులు, చేర్పులకు కమిషన్‌కు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఏఆర్‌ తో పాటు ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేటు కళాశాలల్లోని బోధనా సిబ్బందికి కమిషన్‌ వర్తించదు. దీంతో పాటు రెండవ జాతీయ జుడీషియల్‌ పే కమిషన్‌ సిఫార్సు చేసిన విధంగా పే స్కేల్‌ పొందుతున్న ఏపీ స్టేట్‌ హయ్యర్‌ జుడీషియల్‌ సర్వీసెస్‌, ఏపీ స్టేట్‌ జుడీషియల్‌ సర్వీసెస్‌ అధికారులకు కూడా పీఆర్‌సీ వర్తింపచేయరాదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

గత 11వ పీఆర్‌సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు శాతం ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఇది వివాదాస్పదంగా మారటంతో 12వ పీఆర్‌సీలో సర్దుబాటు చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం నిబద్దత కలిగిన ఐఏఎస్‌ (రిటైర్డు) మన్మోహన్‌సింగ్‌ను కొత్త పీఆర్‌సీ కమిషనర్‌గా నియమించటం పట్ల హర్షామోదం వ్యక్తం చేస్తున్నాయి.

వీలైనంత త్వరలో ఐఆర్‌ ప్రకటించాలి- బొప్పరాజు
ఉద్యోగులు 11వ పీఆర్‌సీ అమలు సందర్భంగా కొంత నష్టపోయారని ఆ నష్టాన్ని భర్తీ చేసేదిగా కొత్త పీఆర్‌సీని ఆమోదించాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్‌ చైర్మన్‌ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి వీవీ మురళీకృష్ణ నాయుడు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ వచ్చేలోగా ప్రభుత్వం వీలైనంత త్వరలో ఐఆర్‌ ప్రకటించి ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.

మాట నిలుపుకున్న సీఎం జగన్‌- వెంకట్రామిరెడ్డి
కొత్త పీఆర్‌సీకి కమిషన్‌ను సకాలంలో నియమించటంతో పాటు ఏడాదిలోగా నివేదికకు మార్గదర్శకాలు జారీ చేయటం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఉద్యోగసంఘాలకు ఇచ్చిన మాట నిలుపుకున్నారని ఏపీజీఈఎఫ్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కొత్త పీఆర్‌సీ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలు కాపాడేదిగా ఉండగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement