Tuesday, November 19, 2024

Spl Story | కాట్పాడి – తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ కు పచ్చ జెండా !

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : సుదీర్ఘ నిరీక్షణ అనంతరం చిత్తూరు ప్రజల కోరిక నెరవేరింది. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే 104 కిలోమీటర్ల డబల్ లైన్ పనులు ప్రారంభం కానున్నాయి. పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ రైల్వే ప్రాజెక్టు మీద ఇటీవల ఢిల్లీలో చర్చ జరిగింది.

డబుల్ లైన్ మంజూరు చేయడమే, కాకుండా సింగల్ లైన్ సెక్షన్ లోని అడ్డంకులను తగ్గించడం ద్వారా రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించనున్నారు. డబుల్ లైన్ మంజూరు కారణంగా చిత్తూరు రైల్వే స్టేషన్ తో పాటు మధ్యలో ఉన్న రైల్వేస్టేషన్ల రూపురేఖలు కూడా మారనున్నాయి.

రైల్వే ప్రయాణికులు ఆటంకాలు లేకుండా ప్రయాణం చేసే వెసులుబాటు కలుగుతుంది. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులు పూర్తయితే ఈ కారిడార్ లో ఉన్న రెండు పారిశ్రామిక పార్కులకు అనుసంధానం మెరుగవుతుంది, పారిశ్రామిక పార్కు, స్పెషల్ ఎకనామిక్ జోన్ కు అవసరమైన యంత్ర పరికరాలు తెప్పించుకోవడం, అక్కడ తయారైన వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించడం సులభం అవుతుంది.

అలాగే చిత్తూరు జిల్లా గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాలో భారీగా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. గ్రానైట్ ఉత్పత్తులను కూడా ఇతర ప్రాంతాలకు సులభంగా తరలించి, అమ్ముకోవచ్చు. అలాగే బెల్లం, మామిడి పంటలను దూరప్రాంతాలకు రవాణా చేయడానికి ఈ కారిడార్ ఉపయోగపడుతుంది.

- Advertisement -

ఈ కారిడార్ ఫలితంగా చెన్నైకి డైరెక్ట్ గా కనెక్టివిటీ ఏర్పడితే, చెన్నై చిత్తూరు తిరుపతి రేణిగుంట మధ్య వ్యాపారాలు మరింత సులభం అవుతాయి. చిత్తూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అదనంగా రైళ్ళు అందుబాటులోకి వస్తాయి. ప్లాట్ఫారాల సంఖ్య పెరగడమే కాకుండా, పలు సౌకర్యాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం చిత్తూరు రైల్వే స్టేషన్ లో మూడు ప్లాట్ ఫారాలు మాత్రమే ఉన్నాయి.

రోజుకు 30 రైళ్ళు చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు 6వేల మంది ప్రయాణికులు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇందువల్ల చిత్తూరు రైల్వే స్టేషన్ కు రోజుకు మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.

చిత్తూరు రైల్వే స్టేషన్ పేరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న విధంగా మిగిలిపోయింది. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి చెందడం లేదు. అటు కాట్పాడి వరకు, ఇటు తిరుపతి వరకు డబుల్ లైన్ సౌకర్యం ఉంది.

కాట్పాడి నుండి తిరుపతి వరకు అంటే 104 కిలోమీటర్లు డబుల్ లైన్ మంజూరు కావడంతో, మరిన్ని రైళ్ళు చిత్తూరు మీదుగా వచ్చే అవకాశం ఉంది. డబుల్ లైన్ కారణంగా చిత్తూరు నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. మధ్య మధ్యలో క్రాసింగ్ కోసం రైలును ఆపే అవకాశం ఉండదు.

ఫలితంగా చిత్తూరు నుండి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు నుండి తిరుపతికి వెళ్లాలన్నా, బెంగళూరు కు వెళ్లాలన్న ఎక్కువ బస్సుల మీదనే ఆధారపడుతున్నారు. చిత్తూరు నుండి తిరుపతికి వెళ్లడానికి బస్సులో గంట సమయం పడితే, అదే ప్యాసింజర్ లో రెండు గంటల వరకు పట్టే అవకాశం ఉంది.

చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్ళు చాలా తక్కువ. దీంతో చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లోని ఎక్కువమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. తిరుపతి కాట్పాడి మధ్య ఒక ప్యాసింజర్ రైలు ఉంది. అది ఏ సమయానికి వస్తుందో సరిగా చెప్పలేని పరిస్థితి.

ఎక్స్ప్రెస్ రైలు వస్తే మధ్య మధ్యలో ప్యాసింజర్ రైలును క్రాసింగ్ కోసం నిలుపుదల చేస్తున్నారు.ఇలా ఈ ప్యాసింజర్ రైలు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తుంది. డబుల్ లైన్ పూర్తి అయితే క్రాసింగ్ ల బెడద ఉండదు. సకాలంలో గమ్యం చేరుకుంటారు. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రయాణికులు బస్సుల మీదనే ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. రైలు ప్రయాణికులు పెరుతారు.

చిత్తూరు మీదుగా 30 రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నా, అందులో ఆరు రైళ్ళు ఇక్కడ ఆగడం లేదు. ప్రతిరోజు నడిచే హౌరా యశ్వంతపూర్, పూణే కన్యాకుమారి ఎక్ష్ప్రెస్స్ రైళ్ళు చిత్తూరులో ఆగవు.

అలాగే వారానికి ఒకసారి నడిచే తిరుపతి రామేశ్వరం, ఓఖ్ల రామేశ్వరం, హైతి యశ్వంతపూర్, హౌరా పాండిచ్చేరి రైళ్లు కూడా ఇక్కడ ఆగవు. ఈ రైళ్ళను చిత్తూరులో కూడా ఆపాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, ఫలితం లేదు.

కాట్పాడి తిరుపతి సింగల్ లైన్ రావడంతో అవి కూడా అగనున్నాయి. చిత్తూరు వ్యాపార కేంద్రం కావడంతో ఇక్కడి వ్యాపారస్తులు చెన్నై, బెంగళూరు నుంచి ఎక్కువగా అవసరమైన వస్తువులను తెచ్చుకుంటుంటారు. అయితే చిత్తూరు నుంచి చెన్నైకి డైరెక్ట్ గా రైలు లేదు.

చెన్నై వెళ్లాలంటే కాట్పాడికి వెళ్లి అక్కడ నుండి మరో రైళ్లు మారాల్సి ఉంటుంది. ఇక బెంగళూరు విషయానికి వస్తే బస్సులో వెళ్తే మూడు గంటలకు, అదే ట్రైన్ లో అయితే ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. కావున బెంగళూరు నుంచి చిత్తూరుకు ప్రయాణికులు రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం లేదు.

సత్వరం రావడానికి బస్సుల మీదనే ఆధారపడుతున్నారు. ఇలా దగ్గరలో ఉన్న ప్రముఖ నగరాలకు చిత్తూరు నుంచి కనెక్టివిటీ లేకపోవడం మరో లోపంగా మారింది. ఈ ప్రాంతాల నుంచి ఎవరైనా వ్యాపార వస్తువులను తెచ్చుకోవాలంటే బస్సుల మీదనే ఆధారపడుతారు. డబుల్ లైన్ వస్తే, ఈ సమస్యలు తీరుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement