ముత్తుకూరు, ప్రభ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్నతాధికారులు, డైరెక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ప్రాజెక్టు షెట్‌డౌన్ చేసే పరిస్థితి వచ్చింది. నిష్ణాతులైన ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కార్మికులు వేల సంఖ్యలో ఉండగా ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థను ప్రాజెక్టు యాజమాన్యం అభాసుపాలు చేస్తుంది. ఇప్పటికే ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రాజెక్టు ప్రైవేటీ-కరణ పోరుబాట నడుస్తుండగా ప్రాజెక్ట్ లో రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఘటన ప్రాజెక్టులో శనివారం జరిగిన కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఏపీ జెన్‌కో ఇంజనీర్లు కాంట్రాక్ట్ కార్మికులలో ఓ వైపు ఆందోళన, మరోవైపు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రం నందు శనివారం ఎలక్ట్రోస్ట్రాటిక్ ఫ్రెసీపీరేటర్ (ఈఎస్‌పీ ఆఫర్ వన్) పగిలిపోవడంతో ప్రాజెక్ట్ లో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈఎస్‌పీ ఆఫర్ పగిలిపోయిన నేపథ్యంలో అక్కడ ఇంజనీర్లు కార్మికులు ఎవరు కూడా లేని మూలంగా ఎటు-వంటి ప్రమాదం జరగలేదు. ఆస్తి నష్టం జరగడానికి గల కారణాలు ఏమిటో చెప్పేందుకు కూడా అధికారులు నిరాకరించారు. ఈఎస్‌పీ ఆఫర్-1 నుండి సైలోకి బూడిదను తీసుకురావాలి. ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆఫర్ పగిలి పోయిందని ఇంజనీర్లు కాంట్రాక్ట్ కార్మికులు ఆరోపణ చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో కోట్లాది రూపాయల నష్టం జరగడానికి కారకులు ఎవరు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో సైలో నుంచి బూడిదను బయటకు పంపించి తరలించే ప్రక్రియలో అధికారులు ఉదాసీనంగా ఉండడంవల్ల ప్రాజెక్టు బ్రష్టు పట్టి ఎలక్ట్రోస్ట్రాటిక్ ఫ్రెసిపీరేటర్ పగిలి పోవడానికి ప్రధాన కారణం అయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు అంతా బూడిద మయంగా మారి సమీప గ్రామాలను చుట్టేసింది. ఏపీ జెన్‌కో విజిలెన్స్ విభాగం నష్టాన్ని అంచనా వేసే ఈ ప్రక్రియలో బిజీబిజీగా ఉందని తెలుస్తుంది. ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు డైరెక్టర్లు యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే ప్రాజెక్టు నష్టాల్లోకి వెళ్లిందని కార్మికులు అంటున్నారు. రెండు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల రాష్ట్రంలో విద్యుత్ కోతలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రాయలసీమ, విజయవాడ, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సమస్యలు వస్తే ఫలితంగా విద్యుత్ కోతలు ఉంటాయని ఇంజనీర్లు అంటున్నారు. ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో బూడిద టె-ండర్ల కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న వివాదం ఈ ప్రమాదం జరగడానికి కారణం అయినట్టుగా విమర్శలు ఉన్నాయి. ఎలక్ట్రోస్ట్రాటిక్ ఫ్రెసిపీరేటర్ ద్వారాసైలో కి బూడిద వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఆ బూడిదను ట్యాంకర్ల ద్వారా బయటకు తరలించాలి. కాంట్రాక్టర్‌ల మధ్య నెలకొన్న వివాదం తారా స్థాయికి చేరుకోవడంతో బూడిద ఎక్కువైపోయి ఈ ప్రమాదం జరిగింది. ఈ విభాగంలో ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు, డైరెక్టర్లు కూడా కొంతమేరకు సర్దుబాటు చేసినట్లు బయట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బూడిద తరలింపులో సమగ్రమైన విధివిధానాలు లేకపోవడంవల్ల ప్రాజెక్టు షెట్‌డౌన్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టులో రాజకీయ రంగు పులుముకున్న సందర్భంలో ఏపీ జెన్‌కో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరో 20 రోజుల పాటు ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు లేవని ఇంజనీర్లు చెబుతున్నారు. ఏదో ఒక సాకు చూపి ప్రాజెక్ట్‌ను అధోగతి పాలు చేస్తారా అంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమగ్రంగావిచారణ చేపట్టాలి..
ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్రంగా విచారణ చేపట్టాలని ధర్మల్ విద్యుత్ కేంద్రం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు గోగుల శ్రీనివాసులు, గడ్డం అంకయ్య డిమాండ్ చేశారు. ప్రైవేటీ కరణ ఉద్యమం చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు అభద్రతాభావం ఏర్పడిందని ప్రాజెక్ట్‌ను దెబ్బతీసేందుకు ఏదో కుట్ర జరిగినట్టు అనుమానంగా ఉందని కమిటీ అధ్యక్షులు పేర్కొన్నారు. నాలుగు నెలల ముందే ఏపీ జెన్‌కో ఇంజనీర్లు హెచ్చరించినప్పటికీ ప్రాజెక్టు డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..