Sunday, November 3, 2024

Gravel Mafia – ఎపిలో చెరువులనూ మింగేస్తున్నారు…..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులపై పడి ఇష్టానుసారంగా మట్టి తవ్వుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్‌ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో పలు చెరువుల్లో విలువైన మట్టి రాత్రికి రాత్రే మాయమైపోతోంది. అదేమని అధికారులను ప్రశ్నిస్తే అనుమతులిచ్చామని, అందుకే మట్టి తవ్వుకుంటున్నారని చెబుతూ అక్రమ తవ్వకాలను ప్రోత్సహి స్తున్నారు. గతంలో పొలాలకు, ఇతర అవసరాలకు చెరువు మట్టిని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇదే సందర్భంలో ఇటుకల తయారీ కూడా చెరువు మట్టిని వాడేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇటుక రేట్లు అమాంతంగా పెరగడం, పలు ప్రాంతా ల్లో ఇటుకకు డిమాండ్‌ మరింత పెరగడంతో క్రమేణా ఇటుక ఖరీదు రూ. 10కి చేరింది. దీంతో సాధారణంగా ఇటుకల బట్టీ కాల్చే వ్యాపారులతోపాటు కొత్తగా మాఫియా కూడా ఇటుక వ్యాపార రంగంలోకి దిగింది. అందుబాటులో ఉన్న చెరువుల్లో ఇష్టానుసారంగా మట్టిని తవ్వేస్తున్నారు. అందుకు ఇరిగేషన్‌ అధికారులు సహకరిస్తున్నారు. అందుకోసం ముడుపులు తీసు కుంటున్నారు. చేతిలో డబ్బులు పడితే తవ్వకానికి అనుమతు లు తీసుకుంటున్నారు. అందుకోసం కొంత మొత్తం కూడా మొక్కుబడిగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు.

అయితే అదే అనుమతులతో పరిధికి మించి మట్టి తవ్వేస్తున్నారు. ముఖ్యంగా మట్టి తవ్వకాలను మాన్యువల్‌గా చేపట్టాల్సి ఉండగా అందుకు పూర్తి విరుద్ధంగా జేసీబీ యంత్రాలతో చెరువుల్లో మట్టి తవ్వేస్తున్నారు. దీంతో రాత్రికి రాత్రే వంద నుండి 150 లోడ్లకు పైగా మట్టి బట్టీలకు తరలిపోతుంది. దాదాపుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇదే పరిస్థిితి కనిపిస్తుంది. కేవలం 50 లోడ్‌ల తవ్వకానికి అనుమతులు తీసుకుని 200 నుండి 300 లోడ్‌ల వరకూ ఆయా చెరువుల్లో మట్టిని మాయం చేస్తు న్నారు. ఇదే విషయాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ తవ్వకాలకు అను మతులిచ్చామని చెబుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే జిల్లా స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు, దాడులు చేసిన సందర్భంలోనూ స్థానికంగా ఉన్న అధికారులు మట్టి తవ్వకాలకు అనుమతులున్నాయంటూ మాఫియాను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బహిరంగంగానే చెరువుల్లో విలువైన మట్టి తరలిపోతున్నది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

ఇటుకలకు గిరాకీతో మట్టి దందా
రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ప్రభుత్వ భవనాలకు సంబంధించి నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఇదే సందర్భంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు వంటి మహా నగరాల్లో అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణం మరింత వేగవంతంగా జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇటుకలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. గతంలో రూ. 5 ఉండే ఇటుక దశలవారీగా పెరుగుతూ రూ. 10కి చేరింది. 2 వేల ఇటుకల లోడు గతంలో రూ. 10 వేలు నుండి రూ. 12 వేలు పలుకుంతుండగా ప్రస్తుతం రూ. 20 వేలకు చేరిందంటే ఇటుకలకు ఎంత డిమాండ్‌ పెరిగిందో స్పష్టంగా అర్థమౌతుంది. దీంతో ఇటుక వ్యాపారులతోపాటు కొంతమంది మాఫియా కూడా బట్టీల రంగంలోకి చొరబడ్డారు. స్థానికంగా ఉన్న ఇరిగేషన్‌ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు సమర్పించి ఆయా ప్రాంతాల్లోని చెరువులో మట్టిని తవ్వేస్తున్నారు. కేవలం 50 ట్రిప్పులకు అనుమతులు తీసుకుని అతి తక్కువ మొత్తం ప్రభుత్వానికి చెల్లించి రెండు రోజుల వ్యవధిలోనే 200 నుండి 300కుపైగా ట్రక్కుల మట్టిని తవ్వేస్తున్నారు. మరికొంతమందైతే ట్రక్కు మట్టిని రూ.650కు విక్రయిస్తున్నారు. ఇలా ఇటుక బట్టీల మసుగులో చెరువుల్లో మట్టిని దోచేసుకుంటున్నారు.

- Advertisement -

యంత్రాలతో రాత్రింబవళ్లు తవ్వకాలు
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇరిగేషన్‌ శాఖకు చెందిన ఏఈ, డీఈ స్థాయి అధికారులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. తమ తప్పులను బయటకు రానివ్వకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తతో మాఫియాతో చేతులు కలిపి చెరువు మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. ఇక్కడే అధికారుల చేతివాటం స్పష్టంగా కనిపిస్తున్నది. మాఫియా నుండి పెద్దఎత్తున ముడపులు తీసుకుని మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు కదా అని అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అసలు ఆ చెరువుల్లో అనుమతులిచ్చిన మేరకే తవ్వకాలు జరపుతున్నారా? అందుకు విరుద్ధంగా పరిధి దాటి మట్టిని తరలిస్తున్నారా అనే అంశంపై దృష్టి సారించడం లేదు. స్థానికంగా ఉన్న అధికారులు చెప్పిందే నిజమని నమ్మేస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు ఫిర్యాదు చేస్తున్నా అనుమతులున్నాయి కదా అని వారి ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. దీంతో మండల స్థాయిలో ఇరిగేషన్‌ అధికారులదే హవా అయిపోతుంది. పేరుకు మాత్రం అనుమతులిచ్చి యంత్రాలతో దగ్గరుండి తవ్వకాలు జరిపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెరువుల్లో మట్టి ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు.

ఉదయగిరి పెద్దచెరువులో…
ఉదాహరణకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పెద్ద చెరువులో మట్టి తవ్వుకునేందుకు స్థానిక అధికారులు అనుతులు ఇచ్చారు. అయితే ఆచెరువులో 50 ట్రిప్పులు మట్టి తవ్వుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించిన అధికారులు గడచిన మూడు రోజులుగా 300కుపైగా ట్రాక్టర్ల విలువైన మట్టిని ఇటుకల బట్టీకి తరలిస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు సందేహాలకు దారితీస్తుంది. అలాగే వెంకట్రావుపల్లి, వెంకటంపేట, కృష్ణంరాజుపల్లి, ఆర్లపడియ, కలువాయి మండల పరిధిలోని తుళ్లూరు, వెరుబొట్లపల్లి, తోపుగుంట, చేజెర్ల మండలంలో కొట్టాలి గ్రామాల పరిధిలో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇదే తరహాలో పెద్ద ఎత్తున చెరువుల్లో మట్టి మాయమైపోతుంది. ఫలితంగా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం కూడా దారిమళ్లుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement