Thursday, November 21, 2024

12 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు మంజూరు చేయండి.. కేంద్రాన్ని కోరిన సీఎం జగన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఉండాలన్న తమ ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు, నిధులిచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిశారు. 5.4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 13 జిల్లాలే ఉండేవని, పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు మరిన్ని మెరుగైన వసతులు కల్పించే క్రమంలో తాము కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామని సీఎం జగన్ కేంద్ర మంత్రికి వివరించారు. లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రతి నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని తాము చాలాకాలంగా కేంద్రాన్ని కోరుతున్నామని గుర్తుచేస్తూ.. 12 జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అప్పుడే 2023 డిసెంబర్ నాటికి మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేసి, 2024 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించగలమని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉందని, రాష్ట్ర ప్రజలకు క్రిటికల్ కేర్ సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. ఈ సమస్యను అధిగమించాలంటే నిపుణులైన వైద్య సిబ్బంది అవసరమని, ఇందుకు ప్రభుత్వ రంగంలోనే తగినన్ని వైద్య కళాశాలలను ఏర్పాటుచేయాల్సిన అవసరముందని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వరంగ వైద్య కళాశాలలు ఉన్నాయని, 2020 మార్చిలో కొత్తగా మరో 3 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసిందని సీఎం జగన్ తెలిపారు. అందులో ఒకటి అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరు వద్ద, మరొకటి కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో, మూడవది పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో మంజూరైనట్టు తెలిపారు. ఈ మెడికల్ కాలేజి భవనాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. మొత్తం 26 జిల్లాలకు ప్రస్తుతం 14 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. జిల్లాల పునర్విభజన అనంతరం 12 జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేయాలని సీఎం జగన్ కేంద్రమంత్రికి వివరించారు.

సీఎం – సీజేఐ పరస్పరం.. నమస్కారం
కేంద్ర మంత్రితో భేటీ కంటే ముందు సీఎం జగన్ ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. ఉదయం గం. 10.00 నుంచి సాయంత్రం గం. 5.00 వరకు రోజంతా జరిగిన సదస్సులో జగన్‌తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కొన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు బదులుగా న్యాయశాఖ మంత్రులు హాజరయ్యారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో న్యాయవ్యవస్థ మౌలిక వసతులను పెంపొందించడం, న్యాయమూర్తులు, న్యాయాధికారుల ఖాళీలను భర్తీ చేయడం సహా పలు అంశాలపై సదస్సులో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. సదస్సు ప్రారంభమవడానికి ముందు ముఖ్యమంత్రులు కూర్చున్న ప్రాంతానికి జస్టిస్ ఎన్వీ రమణ స్వయంగా వచ్చి, అందరినీ పలకరించారు. సీఎం జగన్, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పరస్పరం నమస్కరించుకున్నారు.

జగన్‌తో దీదీ మంతనాలు
ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల సదస్సుకు హాజరైన పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సైతం అక్కడున్న ముఖ్యమంత్రులు, మంత్రులను పలకరించారు. అయితే సీఎం జగన్‌తో మాత్రం కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత మరో హాల్‌లో జరిగిన చర్చలోనూ భోజన విరామ సమయంలో జగన్‌తో ఆమె విడిగా మాట్లాడుతూ కనిపించారు. అక్షరక్రమాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉండడంతో, జగన్ పక్కన అరుణాచల్ సీఎం పేమా ఖండు కూర్చున్నారు. విరామ సమయంలో ఎక్కువసేపు ఖండుతోనే జగన్ మాట్లాడుతూ కనిపించారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని విందు
సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసిన తర్వాత సీఎం జగన్ ప్రధాని ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన మంత్రి విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు హాజరై నేరుగా విజయవాడకు తిరుగుప్రయాణమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement