Friday, November 22, 2024

ఘ‌నంగా తిరుప‌తి జ‌న్మ‌దిన వేడుక‌లు..

తిరుపతి సిటీ, ఫిబ్రవరి 24 (ప్రభ న్యూస్) : తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి 893వ జన్మదిన వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వ‌హించారు. శ్రీవారి పూజ కైంకార్యాలను నిర్దేశించిన జగద్గురు శ్రీ రామానుజాచార్యులే స్వయంగా శంకుస్థాపన చేసిన ఒకనాటి బ్రాహ్మణ అగ్రహారమైన నేటి తిరుపతి పరపతి మరింత ఎత్తుకు పెరిగేలా శుక్రవారం ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులు భూమన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పండుగ ఆత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ గోవింద రాజు స్వామి వారికి సమర్పించారు. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అర్చకులు జీయర్ స్వాములు ఆశీస్సులు తీసుకుని శోభాయాత్రను ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు భజన మండల కళా ప్రదర్శనల నడుమ ఆధ్యాత్మిక యాత్ర శోభాయమానంగా భక్తిశ్రద్ధలతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన చెక్కభజనలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు అదేవిధంగా భక్తులు పౌరాణిక వేషధారణలో భక్తిశ్రద్ధలతో తిరుపతి నగరం అంతా గోవిందనామ స్మర‌ణ‌తో అడుగడుగునా భక్తులు పచ్చ తోరణాలు కట్టి పుష్పాలు, నీళ్లు గుమ్మరిస్తూ స్వాగతించారు.

అనంతరం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గోవిందరాజు స్వామిని ముక్కోటి దేవతలు పూజిస్తారని వివరించారు. శ్రీ మహా విష్ణువే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో స్వయంభూవుగా వెలిసిన మహా పుణ్యక్షేత్రమని తెలియజేశారు. దైవ సమనులైన సమతా మూర్తి శ్రీ రామానుజచార్యులు 1130 ఫిబ్రవరి 24వ తేదీన శంకుస్థాపన చేసిన ప్రాంతం ఇదేనని గుర్తు చేశారు. ప్రపంచంలో వ్యక్తులకు మాత్రమే జన్మదిన వేడుకలు జరుగుతాయని అయితే ఓ ప్రాంతానికి జన్మదిన వేడుకలు జరగడం అంటే ఒక తిరుపతికి మాత్రమే అని పేర్కొన్నారు. ఆ భగవంతుని అనుగ్రహం వల్లే తాను ఇలాంటి మహోన్నత కార్యక్రమం చేస్తున్నార‌న్నారు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టడం నిజంగా తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. టీటీడీ నగరపాలక సంస్థలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన్ అభినయ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement