Tuesday, November 19, 2024

AP: ధాన్యం ఎంత తెచ్చినా కొనుగోలు చేయాలి… సివిల్ స‌ప్ల‌యిస్ క‌మిష‌న‌ర్

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 4 (ప్రభ న్యూస్) : రైతులు కొనుగోలు కేంద్రాల‌కు ఎంత ధాన్యం తెచ్చినా కొనుగోలు చేయాల‌ని, సివిల్ స‌ప్ల‌యిస్ క‌మిష‌ర్ హ‌నుమంతు అరుణ్‌కుమార్ ఆదేశించారు. రైతు పూర్తిగా సంతృప్తి చెందేవిధంగా కొనుగోలు ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జిల్లాలో శ‌నివారం ఆయ‌న ప‌ర్య‌టించారు. ఖ‌రీఫ్ ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌పై ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్‌లో స‌మీక్షించారు. ముందుగా జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ… జిల్లాలోని ప‌రిస్థితిని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ‌ను ప్రారంభించేందుకు చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. ఈ ఏడాది సుమారు 4,63,624 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం దిగుబ‌డి ఉంటుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు తెలిపారు. దీనిలో స్థానిక అవ‌స‌రాలు పోనూ, మార్కెట్‌కు సుమారుగా 4,05,200 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం వ‌స్తుంద‌ని, దీనిలో దాదాపు 3,41,000 మెట్రిక్ ట‌న్నుల‌ను కొనుగోలు చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా నిర్ణ‌యించిన‌ట్లు వివ‌రించారు. జిల్లాలో 510 రైతు భ‌రోసా కేంద్రాలు ఉన్నాయ‌ని, 246 క్ల‌ష్ట‌ర్లుగా ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. న‌వంబ‌రు 15 నాటికి అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేస్తామ‌ని చెప్పారు.


క‌మిష‌న‌ర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ… ల‌క్ష్యంతో సంబంధం లేకుండా రైతులు ఎంత ధాన్యం తెచ్చినా కొనుగోలు చేయాల‌ని సూచించారు. రైతుల‌కు మేలు జ‌రిగే విధంగా చూడాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్నారు. రైతు సంతృప్తి, సంతోషం మ‌న ల‌క్ష్యాలు కావాల‌ని సూచించారు. మిల్లు సామ‌ర్థ్యాన్ని బ‌ట్టే లక్ష్యాలు కేటాయించాల‌ని, ఎక్కువ‌ బ్యాంకు గ్యారంటీ ఇచ్చినా, సామ‌ర్ధ్యం కంటే అద‌నంగా ధాన్యం కేటాయించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక్కో ఆర్‌బీకే కి 10 నుంచి 15 వాహ‌నాల‌ను కేటాయించాల‌ని, ప్ర‌తీ వాహ‌నానికి జీపీఎస్ ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. గోనె సంచులు, లేబ‌ర్ ఖ‌ర్చుల‌ను రైతులే చెల్లిస్తే, వారికి జ‌మ చేస్తామ‌ని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 5 రోజుల్లోనే రైతుల‌కు డబ్బు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు. స‌మీక్షా స‌మావేశంలో డీఎస్ఓ మ‌ధుసూద‌న‌రావు, సివిల్ స‌ప్ల‌యిస్ కార్పొరేష‌న్ డీఎం మీనాకుమారి, జిల్లా వ్య‌వ‌సాయాధికారి వీటీ రామారావు, ఉద్యాన శాఖాధికారి జ‌మ‌ద‌గ్ని, ఇత‌ర జిల్లా అధికారులు, సివిల్ స‌ప్ల‌యిస్ డీటీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement