(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : కృష్ణమ్మకు ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు పెద్ద ఎత్తున తరలివస్తోంది. కృష్ణానదికి ఎగువ ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలు, పలు ప్రాజెక్టుల్లో మిగులు జలాలను దిగుక విడుదల చేసిన నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది.
పెద్ద ఎత్తున మిగులు జలాలు ప్రకాశం బ్యారేజీ కి చేరుకున్న నేపథ్యంలో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా నదికి ఇన్ ఫ్లో 84,297 క్యూసెక్కులు ఉండగా, కుడి ఎడమ కాలువలకు 6,547 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో మొత్తం బ్యారేజీ గేట్లలో 40 గేట్లను రెండు అడుగుల మేర, 30 గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి దిగువకు 77 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఈ పరిస్థితుల్లో బ్యారేజీ నుండి సముద్రంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వృధాగా పోతుంది. అయితే ఈ నీటి మరింత పెరగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం, నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రత్యేక కంట్రోల్లో రూమ్ ను సైతం ఏర్పాటు చేశారు.