Friday, November 22, 2024

స్కిల్ స్కామ్ తో రూ. 371కోట్లు న‌ష్టం….అందుకే చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్

విజ‌య‌వాడ – టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ప్రస్తుతం ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆయనను విజయవాడకు తీసుకొస్తున్నారు. మరోవైపు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ఈ అరెస్ట్ కు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో చంద్రబాబును అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు.

ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వాటిల్లిందని అడిషనల్ డీజీ చెప్పారు. షెల్ కంపెనీలకు ఈ డబ్బును తరలించారని అన్నారు. చంద్రబాబు చెపితేనే అగ్రిమెంట్లు జరిగాయని చెప్పారు. ఇందులో చంద్రబాబే సూత్రధారి అని సాక్షులు చెప్పారని వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు.

ఈ కేసులో నారా లోకేశ్ ను కూడా ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. నిధులు కాజేసేందుకే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. గంటా సుబ్బారావును కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా నియమించారని తెలిపారు. ఆయనకు నాలుగు పదవులు కట్టబెట్టారని అన్నారు. ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా దీనిపై విచారణ జరిపాయని చెప్పారు. నకిలీ ఇన్ వాయిస్ ల ఆధారంగా నగదు బదిలీ చేశారని తెలిపారు. న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. అన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పదని అన్నారు. ఈ కేసులోని ఇతర నిందితులు దుబాయ్, యూఎస్ లలో ఉన్నారని… వారిని అక్కడి నుంచి తీసుకురావడానికి ఆయా దేశాలకు అధికారులు వెళ్తారని చెప్పారు.

- Advertisement -

కేబినెట్ ఆమోదం కూడా లేదు

సిమెన్స్ సంస్థ నుంచి రూ.550 కోట్లు పెట్టుబడి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం జీవోల ద్వారా రూ.371 కోట్లు ఇచ్చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదు. రూ.540 కోట్ల వ్యయం అయ్యే 6 సెంటర్ ఆఫ్ ఎక్‌లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. రూ.3 వేల కోట్లతో అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ.58 కోట్లతో సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. దాన్నే బాగా పెంచి చూపించి కుట్రకు పాల్పడ్డారు. డిజైన్ టెక్‌కు చెందిన మనోజ్ పర్డాసాని, అలాగే చంద్రబాబు కార్యదర్శి శ్రీనివాస్ కూడా పరారీలో ఉన్నారు.

దుబాయి, అమెరికాకు వెళ్తున్నాం

ఈ కేసుకు సంబంధించి సీఐడీ బృందాలు దుబాయి, అమెరికాకు వెళ్తున్నాయి. ఈ కేసులో రాజేశ్, నారా లోకేశ్‌ పాత్రలు ఎంత ఉన్నాయన్నది తేలుస్తాం. ఏపీ ఫైబర్ నెట్‌తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో లోకేశ్‌ పాత్రపైనా విచారణ చేస్తాం. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పరుస్తాం. ఆయణ్ని విజయవాడకు తీసుకురావడానికి హెలికాప్టర్ సిద్ధం చేశాం.. అయితే దాన్ని ఆయన వద్దన్నారు. ఆయన వయసు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. స్కిల్‌ డెవలపెంట్‌ కేసులో అంతిమ లబ్ధిదారు చంద్రబాబే. ఆయన కీలక పాత్రధారి కాబట్టే అరెస్టు చేశాం” అని సీఐడీ చీఫ్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement