Friday, November 22, 2024

ల‌క్ష కొట్టు – కోటి ప‌ట్టు…అధికారుల చేతివాటం – ప్ర‌భుత్వం మౌనం

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రభుత్వ ఆస్తులకు, ఆదాయానికి రక్షణగా ఉండాల్సిన అధికారులే భక్షకులుగా మారిపోతున్నారు. అక్రమాలపై కొరఢా ఝుళిపించి ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చాల్సిన అధికారులే కాసుల కోసం కక్కుర్తిపడి ప్రభుత్వ ఖజానాకు పరోక్షంగా గండి కొడుతున్నారు. ప్రధానంగా పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా లే అవుట్ల అనుమతుల్లో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది. అధికారులు అక్రమాలకు పచ్చజెండా ఊపుతూ సొంత ఖజానా నింపుకుంటున్నారు. దీంతో రియల్‌ మాఫియా మరో అడుగు ముందుకేసి తమ అక్రమాల వేగాన్ని పెంచుతున్నాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వ భూములు సైతం తమ లే అవుట్లలో కలుపుకుని బహిరంగంగా ఆ భూములను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటు న్నాయి. ఇంత జరుగుతున్నా పట్టణాభివృద్ధి సంస్థ అధికారులుగానీ, పాలకవర్గ ప్రజా ప్రతినిధులుగానీ అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడాన్ని బట్టి చూస్తుంటే ప్రతి లే అవుట్‌కు సంబంధించి సంబంధిత అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నాయన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధితోపాటు కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలకు సమీపంలో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే జాతీయ రహదారికి సమీపంలో ప్రైవేటు భూములను కొనుగోలుచేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాటికి సమీపంలో ఉన్న ఇరిగేషన్‌, రిజర్వు స్థలాలను తమ లే అవుట్లలో కలుపుకుని బహిరంగంగా విక్రయిస్తున్నారు. ఆ లే అవుట్లకు ఎకరాకు రూ. లక్ష వంతున మామూళ్లు తీసుకుని పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు పచ్చ జెండా ఊపుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా కేంద్రాల పరిధిలో ఒక్కో నెలకు ఒక్కో పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో అధికారికి రూ. 50 లక్షల నుండి రూ. కోటి వరకూ ముడుపులు అందుతున్నాయంటే అక్రమ లే అవుట్ల వ్యవహారం ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

విలువైన భూముల ఆక్రమణ
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు. అందులో భాగంగా సుమారు 30 లక్షల మంది పేదలకు సుమారు 25 వేల ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేశారు. అందుకోసం రూ. 11,500 కోట్లు వెచ్చించి ఆ లే అవుట్లను ఆధునీకరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఆయా ప్రాంతాల్లో భూములకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలకు నలువైపులా జగనన్న లే అవుట్లను ఆధునకీరిస్తున్నారు. దీంతో వాటికి సమీపంలోని ప్రైవేటు భూముల్లో పెద్ద ఎత్తున కొంత మంది రియల్‌ వ్యాపారులు వెంచర్లు వేస్తున్నారు. అందుకోసం సంబంధిత అధికారుల నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అనుమతుల విషయంలో జరుగుతున్న అక్రమాలు ఒక ఎత్తు అయితే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటవుతున్న ప్రైవేటు వెంచర్లలో విలువైన ప్రభుత్వ భూములను కలిపేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా విలువైన భూములను ఆక్రమించేస్తున్నారు. ఇదే సందర్భంలో జిల్లా కేంద్రాలకు సమీపంలో ఇరిగేషన్‌ స్థలాలను సైతం లే అవుట్లలో కలుపుకుని దర్జాగా ప్లాట్లు విక్రయిచ్చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రెండు రకాలుగా నష్టం వాటిల్లుతుంది. కోట్లాది రూపాలయ విలువచేసే ఇరిగేషన్‌ భూములను రియల్‌ వ్యాపారులు తమ వెంచర్లలో కలుపుకోవడం వల్ల భవిష్యత్‌లో ఇరిగేషన్‌ శాఖ అవసరాలకు స్థలాలు దొరకడం ఇబ్బందికరంగా మారడంతోపాటు ప్రభుత్వంపై అదనపు భారం కూడా పడే ప్రమాదం ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వ భూములకు సంబంధించి రూపాయి కూడా చెల్లించకుండా దొడ్డి దారిన అక్రమించేసుకుని అవే భూములను వెంచర్లుగా మార్చేసి 10 నుండి 15 లక్షలకు విక్రయించేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విలువైన భూములు కాస్తా మాయమైపోతున్నాయి.

లే అవుట్ల అనుమతుల్లో .. పట్టణాభివృద్ధి సంస్థ చేతివాటం
తిరుపతి నుండి విశాఖ వరకూ వివిధ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో రెండు వేలకు పైగా లే అవుట్లు ఉన్నాయి. వీటిలో కనీసం 50 శాతం లే అవుట్లు కూడా సరైన అనుమతుల్లేవు. అందులో 30 శాతం పైగా లే అవుట్లలో ప్రభుత్వ భూములను కలిపేసుకున్నారు. అందుకు ఆయా జిల్లాల పరిధిలోని అధికారుల సహకారం పరోక్షంగా ప్రత్యక్షంగా రియల్‌ మాఫియాకు అందుతుంది. ఫలితంగానే ప్రభుత్వ భూములన్నీ లే అవుట్లుగా మారిపోతున్నాయి. ఉదాహరణకు తిరుపతి జిల్లా పరిధిలో సూళ్లూరుపేట, నాయుడుపేట , తడ జాతీయ రహదారికి ఇరువైపులా 75కుపైగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేశారు. వాటిలో కనీసం చూద్దామన్నా 50 లే అవుట్లకుపైగా సరైన అనుమతుల్లేవు. పట్టణాభివృద్ధి సంస్థ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులిచ్చి తమ వ్యాపారాలను ముందుకు సాగిస్తున్నారు. అలాగే చిల్లకూరు, గూడూరు, మనుబోలు మండలాల పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల పరిధిలో కూడా మరో 50కుపైగా లే అవుట్లు వేశారు. వాటిలో 40 లే అవుట్లకుపైగా అక్రమ లే అవుట్లే ఉన్నాయంటే అధికారులు ఏ స్థాయిలో రియల్‌ మాఫియాతో చేతులు కలిపారో అర్ధమౌతుంది.

ఇక నెల్లూరు జిల్లా పరిధిలోని వెంకటాచలం, నెల్లూరు రూరల్‌, కోవూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, కావలి మండలా ల పరిధిలో అక్రమ లే అవుట్ల విషయమైతే చెప్పాల్సిన పనే లేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న నెల్లూరు సమీప ప్రాంతాల్లో 150కుపైగా లే అవుట్లు ఉన్నాయి. వాటిలో 118 లే అవుట్లలో అనుమతులు సరిగా లేవని అధికారులే తేల్చి చెప్పారంటే ఈప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ ముసుగులో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో అర్ధమౌతుంది. టీపీ గూడూరు మండల పరిధిలోని ఓ అవుట్లో ఏకంగా మూడు ఎకరాల ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించుకుని లే అవుట్లు వేసుకున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక కావలి విషయానికొస్తే చెప్పాల్సిన అసరమే లేదు. కావలి పట్టణానికి సమీపంలోని జాతీయ రహదారికి ఇరువైపులా పట్టణ ప్రాంతం పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులంతా ఈ ప్రాంతంలోనే పెట్ట ఎత్తున పెట్టుబడులు పెట్టి భూములు కొనుగోలు చేశారు. ఇదే ముసుగులో రెవెన్యూ భూములను కూడా కబ్జా చేసి లే అవుట్లు వేశారు. ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం పట్టణ ప్రాంతాల పరిధిలో కూడా ఇదే తరహాలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వందల సంఖ్యలో అక్రమ లే అవుట్లు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement