Saturday, November 23, 2024

Breaking: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ఉద్యోగులు 

ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 7 గంటల పాటు మంత్రుల కమిటీతో చర్చలు జరిగాయి. సచ్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకోనున్నాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లు కొన్ని ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో సమ్మెకు స్వస్తి పలికాయి.  కొత్త పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు గత కొద్దిరోజూలుగా నెలకొన్న వివాదం ముగిసింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగ సంఘాల డిమాండ్లు కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యంగా హెచ్ఆర్ఏను కొద్దిగా పెంచడం, సీసీఏ కొనసాగింపు, అదనపు క్వాంటం పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిట్‌మెంట్ 23 శాతం కంటే ఎక్కువ చేయాలన్న డిమాండ్‌కు మాత్రం ప్రభుత్వం నిరాకరించింది. ఐఆర్ రికవరీ చేయకూడదని..ఐదేళ్లకోసారి పీఆర్సీ విధానం కొనసాగించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను మంత్రుల కమిటీ ముందుగానే అంగీకరించింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

మరోవైపు ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించారు. డిమాండ్ల పరిష్కారం కోసం తమతో కలిసొచ్చే సంఘాలతో ఉద్యమిస్తామని స్పష్టం చేశాయి.

సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) కాలపరిమితిని 10 ఏళ్ల నుంచి ఐదేళ్లకు కుదించేందుకు అంగీకరించామని తెలిపారు. ఇకపై 10%, 12% చొప్పున నాలుగు హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఉంటాయని తెలిపారు.

కాగా, చర్చల్లో ప్రభుత్వం తరపున మంత్రులు పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సీఎస్ సమీర్ శర్మ, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొనగా.. ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement