Thursday, November 21, 2024

గజవాహనంపై విహ‌రించిన‌ గోవిందుడు.. క‌న్నుల‌పండువ‌గా బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమల, (ప్రభ న్యూస్‌): తిరుమల వేంకటేశ్వరస్వామి వార్షికబ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవరోజు శ్రీనివాసుని ఉత్సవ మూర్తి అయిన శ్రీ మలయప్పస్వామి బంగారు గజవాహనంపై ఆదివారం రాత్రి 7 గంటలకు తిరుమాడవీధులలో వైభవంగా ఊరేగారు. రంగనాయకుల మండ పంలో మలయప్పస్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపచేసి వజ్ర, వైడూర్య, రత్నాభరణాలతో అలంకరించి గజవాహనాన్ని అధిరోహింప చేశారు. గజవాహనం అనాది నుండి ప్రసిధ్ధమే పూర్వం యుద్దాలలో రథ, గజాశ్వాలను వాహనాలుగా ఉపయోగించే వారు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిరోహణం చేయించి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ కొనసాగుతుంది.

వేంకటేశ్వరస్వామి గజవాహన రూడుడై తిరుమల మాడవీధులలో ఊరేగడం భక్తులకు ఓ మరపురాని దృశ్యం. ఈ ఉత్సవ కార్యక్రమంలో ముందు వైపు బ్రహ్మ రథం, అంబారీలు, వృషభాలు, అశ్వాలు, నారీమణుల కోలాటాలు, నర్తకీమణుల నృత్యాలు, జానపద కళాకారుల జానపద నృత్యాలు, భజన బృందాలు భజనలు ఆకర్షణగా నిలిచాయి. తిరుమాడా వీధులలో గజవాహనాన్ని అధిరోహించి శ్రీమలయప్పస్వామి ఊరేగుతున్నప్పుడు భక్తులు గోవిందనామస్మరణతో మైమరచి తన్మయత్వం పొందారు.

ఈ వాహనసేవలో జీయంగార్లు, టిటిడి చైర్మెన్‌ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, తిరుపతి జేఈవోలు వీరబ్రహ్మం, సదాభార్గవి, సివిఎస్‌ఓ నరసింహకిషోర్‌, ఆలయ డిప్యూటి ఈవో రమేష్‌బాబు, బోర్డు సభ్యులు, పోలీస్‌ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవరోజైన నేడు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనాల పై స్వామి వారు భక్తులకు దర్శన మివ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement