(ప్రభ న్యూస్ ఇబ్రహీంపట్నం) : 2029 నాటికి రాష్ట్రంలోని అందరికీ ఇళ్ల నిర్మాణమే లక్ష్యమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, కొండపల్లి, జి.కొండూరు మండలం వెల్లటూరు, మైలవరం మండలం పూరగుట్ట జగనన్న కాలనీల్లో గురువారం స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి పర్యటించారు. కాలనీలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘనల వల్ల గృహ నిర్మాణాలు కుంటుపడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేసిన రూ.4,500 కోట్లను రాష్ట్రం ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగించిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, తప్పులను అధిగమించి గృహ నిర్మాణాలను పూర్తి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అర్బన్ ప్రాంతాల్లోని కాలనీల్లో మౌలిక సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ పథకంలో నిధుల సేకరణతో పాటు, రూరల్ ప్రాంతాల్లో ఎన్ఆర్ఈజీఎస్, జేజేఎం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా అందించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు రాష్ట్రం ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయని, అందులో గృహ నిర్మాణ పథకం ఒకటన్నారు.
వంద రోజుల్లో 1.25 లక్షల ఇళ్లు, ఏడాదిలో రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు నిర్మించడమే లక్ష్యమన్నారు. తమ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఇంకా ఇళ్లు లేని పేదలు 11లక్షల మంది ఉన్నారని, వారందరికీ ఈ కొత్త పథకంలో ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ… జగనన్న కాలనీల్లో అనర్హులు ఇళ్ల స్థలాలు పొంది ఉంటే పారదర్శకంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పట్టాలను అర్హులకు కేటాయించి న్యాయం చేస్తామన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకుని ఇబ్రహీంపట్నం జగనన్న కాలనీకి ఎన్టీఆర్ అండ్ మల్లెల అనంత పద్మనాభ రావు కాలనీగా నామకరణం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల గాంధీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.