మట్టిని రక్షించడం కోసం సద్గురు ప్రారంభించిన ఉద్యమానికి ఏపీ ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగర శివార్లలోని జి ఆర్ సి కన్వెన్షన్ లో మట్టిని రక్షించు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ, ఈషా అవుట్ రీచ్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఈషా వ్యవస్థాపకులు సద్గురు, రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మట్టిని రక్షించు ఉద్యమాన్ని మహత్తరమైన కార్యక్రమంగా అభివర్ణించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మట్టిని రక్షించు అనే నినాదంతో చేపట్టిన సద్గురు యాత్ర ప్రజలందరికీ ఉపయోగపడే వినూత్న కార్యక్రమం అని తెలిపారు. మట్టిని ఏ విధంగా రక్షించుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో, అత్యంత కీలకమైన, అవసరమైన సమయంలో రైతులను చైతన్యవంతం చేసేందుకు సద్గురు నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ యాత్ర ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేయాలని నిర్ణయించి, వారి తరఫున ప్రతినిధిగా తనను ఈ కార్యక్రమానికి పంపినట్లు మంత్రి తెలియజేశారు.
మట్టిని రక్షించాలని ప్రతి ఒక్కరూ నినదించాలి : సద్గురు
మట్టి అంతరించిపోతున్న నేపథ్యంలో మట్టిని రక్షించాలని ప్రతి ఒక్కరు నినదించాలని సద్గురు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మానవాళి ముందు ఉన్న అతిపెద్ద ముప్పు మట్టి అంతరించిపోవడమని, భవిష్యత్ తరాలకు సజీవ మట్టిని అందించాలని, రాబోవు 10,15 ఏళ్లలో మట్టి పునరుత్పత్తికి ప్రయత్నించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుక చాలా ముఖ్యమైనదన్నారు. మట్టి రక్షణ నిత్య సంభాషణల్లో భాగం కావాలన్నారు. మూడు నెలల క్రితం ఈ ఊసే లేదని, ప్రస్తుతం ఈ ఉద్యమం కారణంగా మూడు బిలియన్ల మంది మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు కూడా మట్టి రక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సద్గురు పిలుపు నిచ్చారు.