విజయనగరం : రైలు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కంటకాపల్లి రైలు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అందజేశారు. ఆసుపత్రిలోని వార్డుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారికి అందుతున్న చికిత్స, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సహాయంపై మంత్రి తెలుసుకున్నారు. రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన 13మందికి, 30మంది గాయపడిన వారిని కలిసి మొత్తం 43మందికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లు పరిహారంగా అందజేస్తోందన్నారు. మంగళవారం 8మందికి పరిహారం అందించాం, ఈరోజు 12మందికి పరిహారం అందజేశాం, రేపటిలోగా అందరికీ పరిహారం అందిస్తామన్నారు.
ఏదైనా అనుకోని ఘటనలు జరిగినపుడు ఆ ఘటనల్లో బాధితులను ఆదుకొని సహాయం అందించి వారికి మానవతా దృక్పథంతో సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చర్యలు చేపడుతున్నారన్నారు. గాయాల పాలైన వారు జీవితాంతం బాధపడకుండా వారికి తోడ్పాటు అందించేందుకు ముఖ్యమంత్రి శాశ్వత అంగవైకల్యం పాలైన వారికి రూ.10 లక్షల సహాయం ప్రకటించారన్నారు. నెల రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి రూ.5 లక్షలు, నెల రోజుల్లోపు చికిత్స పూర్తయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వారికి రూ.2 లక్షలు సహాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎం.ఎల్.సి. సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఎం.హెచ్.ఓ. డా.భాస్కరరావు, డి.సి.హెచ్.ఎస్. డా.గౌరీశంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు.