అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండు చేసింది. రాష్ట్రంలో సుమారు 50 వేల మంది మున్సిపల్ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ ఇతర విభాగాలతోపాటు పర్మినెంట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ప ట్టించుకోకపోవడం దుర్మార్గమని ఖండించింది. ప్రజారోగ్యం, పర్యావరణం, పట్టణాల పరిశుభ్రతలో పౌరసదుపాయాల కల్పనలో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమ్మెను విరమింపచేసి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈమేరకు పోరాటం చేయాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సిపి ఎం రాష్ట్ర కమిటీ- సమావేశం విజయవాడలో బుధవారం జరి గింది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.18 వేలు జీతం చెల్లిస్తామన్న హామీతో సహా కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, ఒప్పందం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ తన హామీలను అటకెక్కించారని, పైగా ఒప్పంద కార్మికులకు ఉద్యోగ భద్రత-కై- భరోసా కల్పిస్తామన్న హామీకి భిన్నంగా ‘ఆప్కాస్’ను తెచ్చి మున్సిపల్ కార్మికులు వద్దంటున్నా బలవంతంగా అందులో చేర్చారన్నారు. ఏ విధమైన రిటెర్‌మెంట్ బెనిఫిట్స్, బిడ్డలకు ఉపాధి కల్పించకుండా వందలాది మందిని విధుల నుండి తొలగించారని, మరోవైపు ఆదాయ పరిమితితో నిమిత్తం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారిశుద్ధ్య, మున్సిపల్ కార్మికులకు అమలు చేస్తామన్న నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. గత్యంతరం లేక కార్మికులు సమ్మెలోకి దిగితే శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడం మానేసి ”సమ్మె విరమించి వస్తేనే చర్చలు జరుపుతామంటూ నిరంకుశ పోకడలు పోవడాన్ని సీపీయం ఖండిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా కార్మిక సంఘాలను వెంటనే చర్చలకు ఆహ్వానించాలని డిమాండు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.