అమరావతి, ఆంధ్రప్రభ : దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం, భారీగా అక్రమ రవాణా సాగడం, గంజాయి సాగుకు ఏపీ హబ్‌గా మారిందని విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో గంజాయి సాగును అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. సాగు నివారణకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టగా.. భవిష్యత్‌లో మరింత వ్యూహాత్మకంగా గంజాయి సాగును అరికట్టడంతో పాటు అక్రమ రవాణాని నివారించేందుకు పోలీస్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి సాగు జరుగుతోంది. మావోయిస్టుల సమస్యతో అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదురవడంతో ఏడాదికి ఏడాది గంజాయి సాగు పెరిగిపోయింది. లాభాలు అధికంగా ఉండటంతో మన్యం ప్రాంతాల్లో సాధారణ రైతులు సైతం గంజాయి సాగు వైపు మొగ్గుచూపడంతో విస్తీర్ణంగా పెరిగింది. దీంతో ఏపీనుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు గంజాయి రవాణా అక్రమంగా జరుగుతోంది.
అయితే మావోయిస్టుల సమస్య క్రమేణా తగ్గడంతో గత రెండు సంవత్సరాలుగా పోలీస్ యంత్రాంగం గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గంజాయి సాగు చేసే ప్రాంతాల్లో దాడులు నిర్వహించడంతో పాటు అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 2 లక్షల కిలోలకు పైగా గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు సుమారు 7 వేల 500 ఎకరాల్లో గంజాయి పంటను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఒరిస్సాలో కూడా గంజాయి సాగు ఉండటంతో ఇది అంత రాష్ట్ర సమస్యగా మారింది. ఈ తరుణంలో ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాల డీజీపీలు సమావేశమై గంజాయి సాగును అరికట్టేందుకు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.