విశాఖపట్నం, ప్రభన్యూస్ :వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించిన క్రైస్తవ సంఘాలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, వారి సమస్యలను వినే అవకాశం కూడా దక్కడం లేదని, అందువల్ల కొత్త పార్టీ పెట్టాలని వారు కోరుకుంటున్నారని క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ అన్నారు. వారి బాధలు వినేందుకు తాను వచ్చానని చెప్పారు. విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రదర్ అనిల్ మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తన మాట విని పనిచేశారని, ఇప్పుడు వారి సమస్యలు వినాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టిన వై.ఎస్.షర్మిళ ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని పెట్టాలని క్రైస్తవ బాధితులంతా కోరుకుంటున్నారని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి పరిస్థితి వినిపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. క్రిష్టియన్ సంఘాలు గత ఎన్నికల ముందు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంతగానో సహాయం చేశాయని తెలిపారు.. తానెప్పుడూ అసెంబ్లిd వైపు వెళ్లనని చెబుతూ, ముఖ్యమంత్రిని రెండున్నరేళ్ల క్రితం కలిశానని, ముఖ్యమంత్రి బిజీగా ఉంటారని, ఆయనవద్దకు వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఏదైనా ఉంటే ఓ లేఖ రాస్తానని బ్రద ర్ అనిల్ అన్నారు. రాజకీయ పార్టీ పెట్టడం అంటే ఒక్కరోజులో జరిగేది కాదని చెబుతూ అరుణ్ కుమార్‌ను ప్రత్యేకమైన పనిమీద వచ్చినట్లుగా తెలిపారు.
వివేకా హత్య కేసులో దోషులు తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో దోషులు తప్పించుకోలేరని అనిల్ స్పష్టం చేశారు. సీబీఐ కేసు విచారణ చేస్తోందని, అంటే అది చిన్న విషయం ఎలా అవుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఏఐసీసీ కౌన్సిల్ జాతీయ నాయకులు హనోక్ మాట్లా డుతూ, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి క్రైస్తవులకు అన్యాయం జరుగుతోందన్నారు. 125 ఏళ్ల నుంచీ ఉన్న బ్రిటీష్ స్కూల్‌లను ఈ ప్రభుత్వం లాక్కుంటోందన్నారు. విశాఖ జిల్లా క్రైస్తవ నాయకులు నాగరాజు మాట్లాడుతూ అనిల్ వల్ల వైసీపీ 70 సీ ట్లు గెలుచుకుందన్నారు. ఎయిడెడ్ స్కూల్‌లు లాక్కుంటున్నారని, సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, కొత్త పార్టీ పెట్టాలని అనిల్‌ను కోరినట్లుగా నాగరాజు పేర్కొన్నారు.