Sunday, November 24, 2024

Delhi | ప్రజారోగ్యానికి పెద్దపీట.. విశాఖలో రెడీ అవుతున్న‌ప్రభుత్వ ఆసుపత్రులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలో 400 పడకల సామర్థ్యంతో అత్యాధునిక ఈఎస్ఐ ఆసుపత్రి ప్రారంభం కానుందని, మరో రెండు కొత్త ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోందని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. సాగర నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి గురువారం సమాధానమిచ్చారు. విశాఖ షీలానగర్ ప్రాంతంలో రూ.384.26 కోట్లతో 350 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అందులో 350 సాధారణ పడకలతో పాటు సూపర్ స్పెషాలిటీ విభాగంలో 50 అదనపు పడకలతో పాటు అత్యాధునిక సదుపాయాలు ఉంటాయని కేంద్రమంత్రి వివరించారు.

భూమికి సంబంధించిన అంశాల కారణంగా ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం జరిగిందని తెలిపారు. మరోవైపు అచ్యుతాపురంలో కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన రెండు ఎకరాల స్థలసేకరణ పూర్తైందని, అందులో ఈఎస్‌ఐ కార్పొరేషన్ 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను సీపీడబ్ల్యుడీకి అప్పగించినట్టు ఆయన జవాబులో పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నంలోని మల్కాపురంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రి పునరుద్ధరణ/మరమ్మత్తు పనులు పూర్తయ్యాయని రామేశ్వర్ తేలి చెప్పారు. విశాఖలో ఈఎస్‌ఐ లబ్ధిదారుల కోసం రెండు కొత్త అత్యాధునిక ఆసుపత్రులను మంజూరు చేసినందుకు జీవీఎల్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement