అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలోని పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. వచ్చే యేడాది జరుగనున్న పది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ పేర్లు, ఇతరత్రా వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. విద్యార్థులు ఈ నెల 16 నుంచి 20 వరకు వివరాలు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఒక ప్రకటలో తెలిపారు.
బోర్డుకు సమర్పించిన విద్యార్థుల దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా ఉంటే సరి చేయాలని సూచించారు. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మాధ్యమం, ఫొటో, సంతకం, మొదటి, రెండో భాష సబ్జెక్టు వివరాలను పరిశీలించాలని ఆయన తెలిపారు. ఆలస్యరుసుము రూ.200తో పరీక్ష ఫీజు గడువు రేపటితో ముగియనుంది.
రూ.500 ఆలస్యరుసుముతో ఈ నెల 10 నుంచి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని దేవానందరెడ్డి స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 2023 ఆగష్టు 31 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలని పేర్కొన్నారు.