Tuesday, November 26, 2024

పంటల బీమా పేరుతో రైతుల నడ్డి విరిచిన ప్రభుత్వం : సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

అమరావతి, ఆంధ్రప్రభ : ఉచిత పంటల బీమా పథకం పేరుతో ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని, క్లైయిమ్‌ చెల్లింపులపై రైతుల్లో అనేక అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 2 వేల 977 కోట్ల ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌లపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏ పంటకు నష్టాన్ని ఏ విధంగా అంచనా వేశారో ఎంత క్లైయిమ్‌ చెల్లిస్తున్నారోనన్న వివరాలు చెప్పకుండా వెబ్‌సైట్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారని అన్నారు. వ్యవసాయశాఖ వెబ్‌సైట్‌ గోప్యంగా ఉంచడం అలవాటుగా మారిందని సోమిరెడ్డి ఆరోపించారు. 2020-21లో మిర్చి పంట న ష్టం అంచనా వేశారని, 2021లో నాలుగు లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేసినట్లుగా క్రాఫ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారని తెలిపారు.

అయితే వ్యవసాయ శాఖ డైరక్టర్‌ మిర్చిపంట వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్‌ కిందట క్లైయిమ్‌లు చెల్లించలేకపోయామని వివరణ ఇచ్చారని, మరోవైపు కేంద్రమంత్రి తెగులు వల్ల మిర్చి పంట దెబ్బతిందని పార్లమెంట్లో సమాధానం చెప్పారని ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయన్నారు. వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్‌ మిర్చిపంటకు ఉన్నప్పుడు క్లైయిమ్‌ ఎందుకు చెల్లించలేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. పంటనష్టం వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా అమలయ్యే కేంద్ర పథకాలను రైతులకు అందకుండా చేసే హక్కు రాష్ట్ర పాలకులకు ఎవరిచ్చారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏయే పథకానికి ఎంత ఖర్చు చేసిందో, ఎంత పరిహారమిచ్చారో అన్ని వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement