ఏపీ ఐ.టీ, పరిశ్రమలు శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో రాష్ట్రంలో విషాదం నెలకొంది. ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్సకి సహకరించకపోవడంతో మరణించినట్లు అపోలో వైద్యుల నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
రాజకీయాలలో ప్రత్యేక శైలి, విలక్షణ పంథాతో కుల,మత,ప్రాంత, వర్గాలకతీతంగా మంచిపేరు సంపాదించుకున్న మంత్రి మేకపాటి..ఇటీవల దుబాయ్ ఎక్స్ పో పర్యటనతో రాష్ట్రానికి రూ.5,150 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 5 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి, పర్యటన విశేషాలు వెల్లడించాలని భావించారు. అయితే, ఉదయాన్నే ఊహించని వార్త తెలియడంతో అభిమానులు, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర ప్రజలు కన్నీటిపర్యంతమవుతున్నారు.
మంత్రి మేకపాటి భౌతిక కాయం నేడు హైదరాబాద్ లోని నివాసానికి తరలిస్తున్నారు. సాయంత్రం వరకూ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ లోని మంత్రి నివాసంలో ఉంచనున్నారు. రేపు నెల్లూరు జిల్లాలోని మంత్రి నివాసానికి భౌతికకాయం తరలించనున్నారు. అమెరికాలో ఉన్న మంత్రి కుమారుడు రేపటికి ఇండియా రానున్నట్లు సమాచారం. బుధవారం నెల్లూరులోనే మంత్రి మేకపాటి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.