తప్పులు ఎత్తి చూపాల్సిన అధికారులు జగన్ కు వత్తాసు పలకడంతోనే ఎపి సర్వనాశనం అయిందని మండి పడ్డారు టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. రాజమండ్రిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో అధికారులు తప్పుడు దారిలో నడిచారని అసహనం వ్యక్తం చేశారు. జగన్ తీరుతో తెలుగు జాతి తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ అన్నారు.
ఇప్పుడు రాష్ట్రాన్ని బాగుచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యతను సీఎం చంద్రబాబు తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూనే చంద్రబాబు పనులు మొదలు పెట్టారన్నారు. సీఎంగా ఛార్జ్ తీసుకున్న వెంటనే భారీగా ఉద్యోగాలు కల్పించే ఫైల్‌పై సంతకం చేశారని గుర్తు చేశారు..ఇక అధికార యంత్రాంగాన్ని గాడిన పెట్టే పని మొదలు పెట్టారని గోరంట్ల చెప్పారు..