Saturday, November 16, 2024

ఏపీలో అక్రమ మైనింగ్‌ జరగడం లేదు: ద్వివేది

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా అక్రమ మైనింగ్‌ జరగడంలేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. లేటరైట్‌కు సంబంధించి 5 వేల టన్నులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. 2018లో ఇచ్చిన కోర్టు ఉత్తర్వుల మేరకు 2021లో అనుమతిచ్చామని వెల్లడించారు. హైకోర్టు తీర్పును అనుసరించి ఒక్కచోటే మైనింగ్‌ జరుగుతోందన్నారు. నిబంధనలు పాటించని లీజుదారులకు జరిమానా విధించామని తెలిపారు. విశాఖపట్నంలో బాక్సైట్ మైనింగ్ చేసే ఆలోచనే లేదన్నారు. కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీఎస్​ఐ అనుమతి మేరకు విశాఖ జిల్లాలోని నాతవరం మండలంలో లేటరైట్ తవ్వకాలకు మొత్తం 6 లీజులకు అనుమతి ఇచ్చినట్లు ద్వివేది తెలిపారు. ఇందులో ఒక లీజు గడువు ముగిసిందని, అప్రోచ్ రోడ్డు లేక మరో 2 లీజుల్లో తవ్వకాలు జరగడం లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఒక లీజులో 5 వేల టన్నులకే అనుమతి ఇచ్చామన్నారు. అక్రమ మైనింగ్​కు పాల్పడిన సింగం భవాని, లోవరాజుకు రూ.19 కోట్ల జరిమానా విధించినట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది వెల్లడించారు. వీరు 2 లక్షల టన్నుల మైనింగ్‌ చేశారని గుర్తించి, జరిమానా విధించామన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement