Friday, November 22, 2024

అధిక లోడ్ తో అర్ధాంత‌రంగా ఆగిపోయిన‌ గూడ్స్ రైలు..

కోసిగి : మండల కేంద్రమైన కోసిగి రైల్వే గేటులో సిమెంట్ ముడి సరుకుతో అధిక లోడ్ కార‌ణంగా రాయచూర్ వైపు నుండి గుంతకల్లు వెళ్తున్న‌ గూడ్స్ రైలు అర్దాంతరంగా ఆగిపోయింది. దీంతో గేటు మీదుగా వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మరికొంత మంది ప్రజలు గూడ్స్ రైలు కింద దూరి అవతలివైపుకు దాటివెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. గూడ్స్ రైలు గంట పాటు ఆగిపోవడంతో వెనుక వచ్చే ముంబై నుండి చెన్నయ్ వెళ్లే మెయిల్ రైలును కూడా పక్క స్టేషన్ అయిన ఐరనగల్లు రైల్వై స్టేషన్ లో రైల్వే అధికారులు దాదాపు 40 నిమిషాల పాటు నిలిపివేశారు. దీంతో ఐరన గల్లు స్టేషన్లో తాగునీరు దొరకక ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిసింది.

మొరాయించిన గూడ్స్ రైలు ఎట్టకేలకు ముందుకు సాగడంతో గేటు గుండా వెళ్లే వాహన దారులు, గేటు దాటే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కొన్ని సంవత్సరాలుగా కోసిగి రైల్వే గేటు వల్ల వాహనదారులు, ఉరుకుంద భక్తులు, కోసిగి మండల ప్రజలు పడే కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. గంటల తరబడి గేటు బయట నిలబడవలసిన పరిస్థితి. ఫై ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ నేటి వరకు రూపు దాల్చలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కోసిగి రైల్వే గేటుకు ప్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుకుండా చూడాలని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement