- నడికుడి సమీపంలో ఘటన
- సికింద్రాబాద్ – గుంటూరు మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు
- లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : సికింద్రాబాద్ – గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం ఇదే లైన్‌లో పొందుగల – నడికుడి మధ్యలో గూడ్స్ పట్టాలు తప్పింది. లోకోపైలట్ అప్రమత్తం కావడంతో గూడ్స్‌కు పెను ప్రమాదం తప్పింది. ఇది సింగిల్ లైన్ కావడంతో సికింద్రాబాద్-నడికుడి-గుంటూరు మధ్య రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
నిలిచిన రైళ్లు…
గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎక్కడికక్కడే ఇతర ట్రైన్ల రాకపోకలు నిలిచిపోయాయి. మిర్యాలగూడ రైల్వేస్టేషన్ లో తిరుమల స్పెషల్ రైలును నిలిపివేశారు. నర్సాపూర్, కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. మరో మూడు రైళ్లను విజయవాడ మీదుగా హైదరాబాద్ మళ్లిస్తున్నారు. అలాగే గూడ్స్ కూడా నిలిచిపోయాయి.
ట్రాక్ పునరుద్ధరణ పనులు
ఈ ఘటన సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టారు. మధ్యాహ్నానికి ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉంది.