Tuesday, November 26, 2024

టికెట్ల ధరల పెంపుపై త్వరలో గుడ్ న్యూస్‌: తెలుగు ఫిల్మ్ చాంబర్

ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని తెలుగు ఫిల్మ్ చాంబర్ తెలిపింది. సినిమా టికెట్ల ధరల పరిశీలన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ ఆధ్వర్యంలోని కమిటీ నిన్న సచివాలయంలో భేటీ జ‌రిగింది. ఈ సందర్భంగా ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 3 గంటలపాటు జరిగిన సమావేశం అనంతరం ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందన్నారు. అన్ని సెంటర్లలోనూ టికెట్ ధరలు పెంచాలని కోరిన‌ట్టు తెలిపారు.

అయితే.. బెనిఫిట్ షోలపై మాత్రం చర్చ జరగలేదని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాందాస్ తెలిపారు. చిరంజీవి, రాంగోపాల్ వర్మ ఎవరు చర్చించినా అది సినీ పరిశ్రమ మేలుకోసమేనని అన్నారు. అధికారులంతా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని, త్వరలోనే మంచి నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్టు సెన్సార్ బోర్డు సభ్యుడు ఓం ప్రకాశ్ అన్నారు. ఏసీ, నాన్ ఏసీ థియేటర్లకు అనుగుణంగా టికెట్ల ధరలు నిర్ణయించాలని కమిటీని కోరినట్టు డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధి రాంప్రసాద్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement