అమరావతి, ఆంధ్రప్రభ : గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతకం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరగనున్నాయి.
జులై 1 నాటికి కొత్త వేతనాలు..
ఈ ఏడాది జూన్ 30నాటికి ప్రొబేషన్ ప్రక్రియ పూర్తికావాలని.. జూలై1 నాటికి వారికి కొత్త జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. సీఎం తాజా ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు- ఇతర పౌర సేవలు సులభంగా ప్రజలకు అందించేందుకు ప్రతి రెండు వేల మంది జనభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు- చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు- చేసిన సీఎం జగన్.. అదే ఏడాది అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.20 లక్షలమందిని నియమించారు. వీరికి రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ అమలు చేసి ఆ తర్వాత ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు జీతాలు కూడా పెంచుతామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఐతే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తై దాదాపు ఐదు నెలలు కావొస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులో వారందరికీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్ పూర్తి చేసినట్లు ధృవీకరించి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని.. పరీక్షలో పాసవ్వనివారికి మరో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 2న ప్రొబేషన్ ముగిసినా ఉద్యోగాల పర్మినెంట్ చేయడానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభంకాలేదు. అక్టోబర్ 2 నాటికి 40వేల మంది, అక్టోబర్ 30నాటికి 30వేల మంది, నవంబర్ నెలాఖరుకు 50వేల మంది రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తైంది. ఇంకా మరికొందరి ప్రొబేషన్ పూర్తికావాల్సి ఉంది.
ఇకపై అన్ని రకాల సదుపాయాలు..
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే వారికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం వారికి రూ.15వేలు జీతం ఇస్తుండగా.. అది రూ.22వేల నుంచి రూ.24 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే వారికి పీఎఫ్, సీపీఎస్, హెల్త్ కార్డులు, కారుణ్య నియామకాలు ఇలా అదనపు సౌకర్యాలు కూడా కల్పించాల్సి ఉంటుంది. దాదాపు లక్షా 20వేల మందికి ఈబెనిఫిట్స్ కల్పించాలంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుంది. అందుకే ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేటాయింపులను బట్టి వీరందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే సీఎం జగన్ జూన్ 30 వరకు అధికారులకు గడువిచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఐదు నెలలుగా ప్రొబేషన్ కోసం ఎదురుచూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం ప్రకటనతో ఊరట లభించిందనే చెప్పాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.