తెలుగు సినీ పరిశ్రమకు, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లను పెంచుతూ ఇవాళ జీవో జారీచేసింది. తాజా జీవో ప్రకారం టికెట్ కనిష్ట ధర రూ.20గా, గరిష్ట ధర రూ.250గా నిర్ణయించింది. ప్రాంతాన్ని బట్టి థియేటర్లను 4 రకాలుగా విభజించి తాజా టికెట్ల ధరలను నిర్ణయిచింది.
అయితే ఈ టికెట్ల రేట్లకు జీఎస్టీ ధరలు అదనం. ఒక్కో థియేటర్లలో రెండు రకాల టికెట్ల రేట్లుండగా.. వాటిని ప్రీమియం, నాన్ ప్రీమియం రేట్లగా నిర్దారించారు. ప్రతీ థియేటర్‌లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం సీట్లకు కేటాయించాలని ఆదేశించింది ప్రభుత్వం. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం.
టికెట్ల ధరలను కనీసం 10 రోజులు పెంచుకునే వీలు కల్పించింది. అయితే 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే తాజా రేట్ల పెంపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. దీంతోపాటు రోజుకు ఐదు షోల్లో ఒక చిన్న సినిమా వేయాలని నిర్దేశించింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో పాత జీవో నంబర్ 35 రద్దైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో విడుదల కాబోతున్న రాధేశ్యామ్‌తోపాటు మిగిలిన చిత్రాలకు ఊరట లభించినట్టైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..