Saturday, November 23, 2024

AP | నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే ఉద్యోగాలు భర్తీ

అమరావతి, ఆంధ్రప్రభ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో త్వరలోనే విద్యా శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ముందు టెట్‌.. ఆ తర్వాత డీఎస్సీ.. నోటిఫికేషన్‌ విడుదల అవుతుందన్నారు. డీఎస్సీపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందన్నారు. డీఎస్సీపై సీఎం దగ్గర చర్చ జరుగుతోందన్నారు.

రానున్న ఎన్నికలకు ముందే డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలల్లో ఖాళీలన్నింటిని గుర్తించాం” అని మంత్రి వెల్లడించారు. యూనివర్శిటీలు, ఐఐటీల్లో ఖాళీగా ఉన్న 3,200కు పైగా పోస్టులను కొద్ది రోజుల్లోనే భర్తీ చేస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.. త్వరలోనే నోటిఫికేషన్‌ వస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -

నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుందన్నారు. దాదాపు 18 ఏళ్లుగా వర్శిటీల్లో శాశ్వత పోస్టుల భర్తీ జరగలేదన్నారు.. ట్రిపుల్‌ ఐటీల్లో లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తామన్నారు.

విద్యా శాఖపై ప్రతి పక్షాలు దుష్ప్రచారం..

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగిందని అయితే ప్రతిపక్షాలు విద్యా శాఖపై దుష్ప్రప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సీఎం జగన్‌ తొలి ప్రాధాన్యత అయిన విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.

బైజూస్‌ కంటెంట్‌ ఫ్రీగానే ఇచ్చామన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అందులోనూ బైజూస్‌ కంటెంట్‌ పెట్టి ఇచ్చామన్నారు. దానికి కూడా బైజూస్‌కి ఒక రూపాయి చెల్లించలేదన్నారు. బైజూస్‌ వ్యాపారాలతో తమకు సంబంధం లేదన్నారు.

విద్యార్థులకు మంచి ఇంగ్లీష్‌ నేర్పడం కోసం టోఫెల్‌..

విద్యార్థులకు మంచి ఇంగ్లీష్‌ నేర్పడం కోసం టోఫెల్‌ను తీసుకొచ్చామాన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్‌కి ఇచ్చేస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టోఫెల్‌లో శిక్షణ కోసం పెట్టే టెస్ట్‌కి ఒక్కో విద్యార్థికి కేవలం రూ.7.50 మాత్రమే ఫీజనీ, 20 లక్షల 75 వేల మందికి ప్రభుత్వం ఆ ఫీజు కట్టిందన్నారు.

ఆ టెస్ట్‌లో పాస్‌ అయిన వారికి మాత్రమే టెస్ట్‌కి రూ.600 ఫీజు తీసుకుంటారన్నారు. మొత్తం కలిపి రూ.6 కోట్లు మాత్రమే టోఫెల్‌ టెస్ట్‌ల కోసం పెడితే రూ.వందల కోట్లు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడానికి ఖర్చు చేయడం తప్పా అని మంత్రి బొత్స నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement