అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వసతిపై కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన సెక్రటేరియట్, హెచ్ఓఢీ ఉద్యోగులకు ఉచిత వసతి ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాజ్ భవన్ ఉద్యోగులకు మరో ఏడాది పాటు ఉచిత వసతి ఉంటుందని తెలిపింది. 2025 జూన్ 26 వరకూ ఉద్యోగులకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉచిత వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉచిత వసతి పొడిగించినందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు. అయితే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉంటున్న అమరావతి సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది. 2017 నుంచి ఈ సౌకర్యాన్ని ఉద్యోగులకు అందిస్తున్నారు. ప్రతి ఏటా ఉద్యోగ సంఘాల నేతల కోరిక మేరకు ఈ సౌకర్యాన్ని కొనసాగిస్తున్నారు.