ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఎత్తివేత
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం..
ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు
ఫస్టియర్ పాస్ అవ్వాలన్న నిబంధన తొలగింపు
ఇంటర్ లో సంస్కరణలపై అభిప్రాయాల సేకరణ
ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడి..
వెలగపూడి – వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి భావిస్తోందని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించాలనే లక్ష్యంతో కేవలం ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షను ఆ ఏడాది సిలబస్‌తో నిర్వహించాలని యోచిస్తున్నామని వివరించారు. ఇంటర్ విద్యలో నాలుగు ప్రధాన సంస్కరణలను ప్రతిపాదించామని సిలబస్, పాఠ్యపుస్తకాల సవరణ, కొత్త సబ్జెక్టు కాంబినేషన్లతో పాటు పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలోనూ సంస్కరణలు తీసుకు రావాలన్నదే తమ ప్రయత్నమన్నారు. ఈనెల 26వ తేదీలోగా తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలను కోరుతూ ప్రతిపాదిత సంస్కరణల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో ప్రజలు పరిశీలించేలా అందుబాటులో ఉంచామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో వివరాలను ప్రతిపాదించారు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య సిలబస్‌లో గత కొన్నేళ్లుగా ఎలాంటి సవరణలు జరగలేదు. 2012లో సైన్సు సబ్జెక్టుల్లో, 2014లో ఆర్ట్స్ సబ్జెక్టుల్లో, 2018లో భాష పాఠ్యాంశాల్లో మార్పులు జరిగాయి. జాతీయ కరికులమ్ చట్టం-2023 అనుసరించి ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో పాఠశాల విద్యాశాఖ ఎన్ సి ఈ ఆర్ టి పుస్తకాలను ప్రవేశపెట్టింది. అందుకు అనుగుణంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో విద్యాభ్యాసనకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగేందుకు ఎన్ సి ఈ ఆర్ టి పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టబోతోంది.
ప్రస్తుత సిలబస్‌లో సవరణలు:
తద్వారా నీట్-జేఈఈ వంటి జాతీయస్థాయి పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా పోటీ పడేందుకు వీలుగా ప్రస్తుత సిలబస్‌లో సవరణలు అవసరమని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 15కిపైగా రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యా ప్రణాళిక అమలులో ఎన్ సి ఈ ఆర్ టి పాఠ్యాపుస్తకాలు ప్రవేశపెట్టారు. సవరణలకు సంబంధించి విద్యారంగంలో అనుభవం ఉన్న విశ్వవిద్యాలయాల ఆచార్యులు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, జూనియర్ కళాశాల అధ్యాపకులతో కమిటీలు వేసి వారి సిఫార్సులకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించింది.
ఇంటర్నల్ మార్కుల విధానం:
సైన్స్ విద్యార్థులకు ప్రస్తుతం రెండు భాషలు, నాలుగు ప్రధాన సబ్జెక్టులు కలిపి మొత్తం ఆరు, ఆర్ట్స్- భాష విద్యార్థులకు ఐదు సబ్జెక్టులున్నాయి. విద్యార్థుల నుంచి మానవీయ శాస్త్ర కోర్సులకు వివిధ రకాల సబ్జెక్టు కాంబినేషన్లు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇస్తున్నారు. అలాగే ఎక్కువ మంది నుంచి ఎంబైపీసీ కోర్సుకు డిమాండ్ ఉంది.
జాతీయ విద్యా విధానం-2020 మార్గదర్శకాల ప్రకారం విశ్లేషణ, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారంపై నైపుణ్యం కోసం మార్కుల కేటాయింపు విధానంలో మార్పులు ప్రతిపాదించారు. అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకొస్తున్నారు. వ్యాస రూప సమాధాన ప్రశ్నలకు ఎనిమిది మార్కులకు బదులు ఐదు లేదా ఆరు మార్కులు కేటాయించాలని భావిస్తున్నారు. దీంతోపాటు ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టబోతున్నారు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా:
తెలుగు రాష్ట్రాలను మినహాయించి దేశంలోని ఏ ముఖ్యమైన ఇతర విద్యా మండళ్లు ఇంటర్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం లేదు. అత్యధిక శాతం కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలను మాత్రమే అర్హత పరీక్షలుగా పరిగణిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మొదటి సంవత్సర పబ్లిక్ పరీక్షలను తొలగించడం ద్వారా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధత కావడానికి సమయం ఉండడమే కాకుండా కీలక అంశాలపై విద్యార్థులు పట్టు సాధించేందుకు వీలుంటుందనేది ఇంటర్ బోర్డు ప్రతిపాదన.
ఇదే సమయంలో ఇంటర్మీడియట్ విద్యా మండలి రూపొందించిన సిలబస్, బ్లూప్రింట్‌లో ఆధారంగా జూనియర్ కళాశాల్లో మొదటి సంవత్సరం పరీక్షలను అంతర్గతంగా నిర్వహించాలనేది కీలక సంస్కరణ. నాలుగు కీలక సంస్కరణల ప్రతిపాదిత విధానాలను bieap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సలహాలు, సూచనలు, అభిప్రాయాలను [email protected] ఈమెయిల్ ఐడీకి పంపాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ కృతికా శుక్లా కోరారు.