Thursday, November 21, 2024

ఆక్వా రైతులకు శుభవార్త.. సెప్టెంబరు 1 నుంచి విద్యుత్‌ రాయితీ

అమరావతి: ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందజేసింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరు ఒకటి నుంచి ఆక్వా రైతులకు మరో తీపి కబురు అందించనుంది పదెకరాల లోపు ఆక్వా జోన్‌ పరిధిలో పదెకరాల్లోపు సాగుచేసే సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీని వర్తింపజేయనుంది. ఈ సందర్భంగా లబ్దదారుల గుర్తింపుకు చేపట్టిన సర్వే ఈ నెలాఖరుతో ముగియనుంది. అర్హతగల వారికి సెప్టెంబర్‌ 1 నుంచి విద్యుత్‌ రాయితీని వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

పదెకరాల్లోపు ఆక్వా రైతుల లబ్ధిదారుల గుర్తింపు..

రాష్ట్రంలో 1.40 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి, 3.89లక్షల ఎకరాల్లో మంచినీటి ఆక్వా సాగు జరుగుతోంది. వీటికి 63,343 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఈ-క్రాప్‌ బుకింగ్‌ ప్రకారం 1,35,842 మంది ఆక్వా రైతులుండగా, 2.5 ఎకరాల లోపు 95,277 మంది, 2.5 నుంచి ఐదెకరాల్లోపు 22,358 మంది, 5-10 ఎకరాల్లోపు 11,809 మంది, పదెకరాలకు పైబడి 6,398 మంది ఉన్నారు. కానీ, నాన్‌ ఆక్వాజోన్‌ పరిధిలో సాగుచేస్తున్న వారు సైతం విద్యుత్‌ రాయితీ ద్వారా లబ్ధిపొందుతున్నారు. అలాగే, కొన్నిచోట్ల కనెక్షన్‌ ఒకరి పేరిట ఉంటే, సాగు మరొకరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత జోన్‌ పరిధిలో ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు మాత్రమే విద్యుత్‌ రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ పరిమితిని పదెకరాలకు పెంచింది. అనంతరం ఆక్వాజోన్‌ పరిధిలో వాస్తవంగా సాగుచేసే పదెకరాల్లోపు రైతులను గుర్తించేందుకు విద్యుత్‌, రెవెన్యూ, మత్స్య శాఖలతో సర్వే చేపట్టింది. విద్యుత్‌ కనెక్షన్‌ ఎవరి పేరిట ఉంది? ఆ కనెక్షన్‌ పరిధిలో ఎంత విస్తీర్ణం ఉంది? ప్రతీనెలా ఎంత విద్యుత్‌ వినియోగమవుతోంది? ఆ చెరువుకు లైసెన్సు ఉందా.. లేదా? వంటి వివరాలను ఈ సర్వేలో సేకరించారు.

జోన్‌ల వారీగా డిస్కంలకు జాబితాలు..

మే నెలలో చేపట్టిన ఈ సర్వే ఆగస్టు నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత జోన్‌, నాన్‌జోన్‌ పరిధిలో ఎంత విస్తీర్ణం ఉంది? వాటి పరిధిలో ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి.. జోన్‌ వారీగా ఎంతమంది ఆక్వా రైతులు ఉన్నారో గుర్తించి ఆ జాబితాలను ఆయా డిస్కంలకు పంపిస్తారు. ప్రభుత్వాదేశాల మేరకు జోన్‌ పరిధిలోకి వచ్చే పదెకరాల్లోపు ఆక్వా రైతులకు సెప్టెంబర్‌ 1 నుంచి విద్యుత్‌ రాయితీని వర్తింపజేసేలా ఏర్పాట్లు-చేస్తున్నారు. విద్యుత్‌ రాయితీ పొందాలంటే జోన్‌ పరిధిలో అర్హతగల ఆక్వా రైతులు తాము సాగుచేస్తున్న భూముల భూరికార్డు, వన్‌ బీ అడంగల్‌, లీజ్‌ అగ్రిమెంట్‌ కాపీ, వీఆర్వో నుంచి పొందిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ కల్చర్‌లతో ఆర్బీకేల్లోని మత్స్య సహాయకులు లేదా మత్స్య అభివృద్ధి అధికారిని సంప్రదించాలి. వివరాలను నమోదు చేయించుకుని విద్యుత్‌ రాయితీకి అర్హత పొందాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement